జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ఏర్పడే రాజకీయపార్టీకి సంబంధించి ఫిబ్రవరి 4న కీలక చర్చలు జరగనున్నాయి. ఆ రోజున హైదరాబాద్ రావలసిందిగా జిల్లాలలోని కీలక నేతలందరికీ కబురు పంపారట. అన్ని చోట్లా వున్న పరిస్థితులను పరిశీలించి పార్టీ స్థాపనపై నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ కదలికలను బట్టి చూసినా కోదండరాం మాటలను బట్టి చూసినా పార్టీ స్థాపనపై సందేహాలేమీ లేవు. ఇప్పటికే ఆలస్యమైపోతుందని జెఎసి సమావేశంలో సభ్యులు వ్యాఖ్యానించారని సమాచారం. అయితే పార్టీ పెట్టినా జెఎసిని కొనసాగించాలని మాత్రం నిర్ణయించుకున్నారు.కోదండరామ్ కొత్త పార్టీ నాయకుడైతే జెఎసి బాధ్యత విద్యుత్ ఉద్యోగ నేత రఘు లేదా ప్రొ, ఇటిక్యాల పురుషోత్తంకు అప్పగించవచ్చునని అంటున్నారు. కోదండ పార్టీ ఏర్పడితే తమకు వూపు వస్తుందని కాంగ్రెస్ ఎదురు చూస్తున్నది.సిపిఐ ఈ కొత్త పార్టీతో కలసి పోటీచేస్తుంది.కాంగ్రెస్‌తోనూ కలసి పోరాడనున్నట్టు ఇప్పటికే సూచనగా చెప్పేశారు ఆ పార్టీ నేతలు. అయితే రాజకీయ కూటమిగా ఏర్పడతారా లేక విడివిడిగా సర్దుబాట్టు చేసుకుంటారా అనేది ఇంకా అస్పష్టంగా వుంది. కోదండ ఇతరపార్టీలతోనూ సర్దుబాట్టు చేసుకోవచ్చని మరో అంచనా. ఒకసారి ఈ పార్టీ ఏర్పడితే బిజెపి నుంచి కూడా కొందరు వచ్చేస్తారని అనుకుంటున్నారు. మరి ఈపార్టీకి సిపిఎం ఏర్పాటు చేసిన బిఎల్ఎప్కు సర్దుబాట్టు మాత్రం సాధ్యమేనా అంటే కష్టమే.ఎందుకంటే తాము 119 సీట్లలోపోటీ చేస్తామని తమ్మినేని వీరభద్రం ఇప్పటికే ప్రకటించి వున్నారు. ఆ కూటమిలో 28 పార్టీలు సంస్థలు వున్నందువల్ల బయిటివారికి కేటాయింపులు కూడా కష్టమే . వెరసి తెలంగాణలో తీవ్రమైన బహుముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తుంది.