బిజెపిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను మరీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి చూడనవసరం లేదని నిన్న చెప్పుకున్నాం. తర్వాత టిడిపి వర్గాలు చెబుతున్న ప్రకారమైతే ముఖ్యమంత్రి సూటిగానే ఆ విధమైన సంయమనం ప్రబోధించారట. మీడియాతో మాట్లాడిన తర్వాత మరోదఫా తమ వాళ్లతో ముచ్చటిస్తూ బిజెపిపై అదేపనిగా విరుచుకుపడటం మంచిది కాదని స్పష్టంగా చెప్పారు. మీరు రాజకీయం నేర్చుకోవయ్యా అని ఒక నేతను ఉద్దేశించి జోక్ చేశారట. సోము వీర్రాజు లేదా విష్ణు కుమార్ రాజు ఏదో అన్నారని రెచ్చిపోతే మనకే నష్టం అన్నది ఆయన సందేశం. మరి దగ్గుబాటి పురంధేశ్వరి సంగతేమిటి? పొత్తుపై తేల్చుకోవలసింది టిడిపినే అని ఆమె అన్నారు కదా అని ఎవరో దృష్టికి తెస్తే- ఆమె ఏదో ఫ్యామిలీ కోపంతో మాట్లాడుతుంటుంది. మీరు ఆమెను మరీ సీరియస్గా తీసుకోనవసరం లేదు అని చంద్రబాబు తేల్చిపారేశారు. అదే సమయంలో తన పట్ల కేంద్రంలో ఎలాటి నిరాదరణ ఎదురైనా ఎవరో ఒకరిని కలిసి వస్తున్నానంటే రాష్ట్రం కోసమేనని వివరించారట. ఇవన్నీ తెలియని బిజెపి రాజులు మాత్రం రెండో రోజు కూడా చెలరేగి పోయారు. అది చూసి కొందరు ఉత్తరాంధ్ర టిడిపి వారూ కోపానికొచ్చారు. ఇదంతా తాటాకు మంటలా చల్లారిపోవలసిందేనని వారికి తెలియదు.