రాష్ట్రపతి కోవింద్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకోపక్క ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సమావేశం జరిగింది. ఈ ప్రముఖ కార్యక్రమాల్లో కామన్ వినిపించిన ఆసక్తికరమైన అంశం… ఒకే దేశం – ఒకేసారి ఎన్నికలు! పార్లమెంటుతోపాటు రాష్ట్రాల ఎన్నికల్ని కూడా ఒకేసారి జరపాలన్న అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్థావించారు. జమిలి ఎన్నికల దిశగా సాధ్యాసాధ్యాలపై ఆలోచించాల్సిందిగా అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు. ఎన్డీయే పక్షాల సమావేశంలో కూడా ఈ అంశాన్నే ప్రధానంగా చర్చకు తీసుకొచ్చారు. మిత్రపక్షాలన్నింటికీ ఇదే అంశమై కొన్ని సూచనలు చేయాలంటూ భాజపా కోరింది. మొత్తంగా, ఈ పరిణామాలు చూస్తుంటే… ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం త్వరలో తీసుకునే దిశగా మోడీ సర్కారు అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి, అనుకున్న సమయం కంటే కాస్త ముందే ఎన్నికలు రావొచ్చనే సంకేతాలు ఇప్పటికే కేంద్రం ఇచ్చేసి ఉంది. ఇప్పుడా గడువు మరికొంత ముందుకు రాబోతోందా అనేట్టుగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.
ఇక, ఒకే దేశం ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటే… వాస్తవానికి ఇది ఇప్పటికిప్పుడు, అంటే 2019 ఎన్నికలతో సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. 2023 లక్ష్యంగానే మోడీ సర్కారు ఇప్పుడీ ప్రక్రియను మొదలుపెడుతోందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భాజపా పాలిత రాష్ట్రాల సంఖ్య 19 ఉంది కాబట్టి.. ఆయా రాష్ట్రాల్లో గడువుకంటే కాస్త ముందుగా కొన్ని అసెంబ్లీలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ఆస్కారం ఉంది. అయితే, భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది ఇప్పుడు సాధ్యం కాదు. గడువు పెంచితే ఊరుకుంటారేమోగానీ… అధికారాన్ని కుదిస్తే ఆ ముఖ్యమంత్రులు గట్టిగా వ్యతిరేకిస్తారు. నిజానికి, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. తరువాత, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు ఉన్నాయి. ఏప్రిల్ లో కర్ణాటక ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు ఇప్పటివరకూ ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాల ఎన్నికలను కూడా ఏడాది చివరి వరకూ వాయిదా వేసి… వీటితోపాటు ఆంధ్రా, తెలంగాణ వంటి రాష్ట్రాలను కలుపుకుని జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కొంత ఆస్కారం ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు అనేది ఒక్క విడతతో సాధ్యమయ్యేది కాదు. కనీసం రెండు లేదా మూడు విడతల్లో ఇలాంటి చిన్నచిన్న సర్దుబాట్లు అవసరం అవుతాయి. ఈ లెక్కన ఈ కల సాకారం కావాలంటే కనీసం మరో రెండు పర్యాయాలైనా మోడీ సర్కారే ఢిల్లీలో అధికార పీఠంపై కూర్చోవాలి! నిజానికి, ఒకేసారి ఎన్నికలు అనేవి మంచి ఆలోచనే అనొచ్చు. ఎందుకంటే, దేశంలో ప్రతీయేటా ఎక్కడో చోట ఏదో ఒక ఎన్నికలు రావడం.. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. అభివృద్ధి కార్యక్రమాలకు కొంత అడ్డంకిగా మారడం జరుగుతోంది. ఇక, ఎన్నికలు ప్రక్రియకు అయ్యే వ్యయ ప్రయాసల దృష్ట్యా ఆలోచించినా జమిలి ఎలక్షన్స్ ఖర్చును తగ్గించే ప్రక్రియే అవుతుంది. ఒకే దేశం ఒకే ఓటు అనే నినాదంతో మోడీ సర్కారు ఓ భారీ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేసేందుకు సంసిద్ధం అవుతున్నట్టుగానే నేడు ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయి.