తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత ఆయన రాజకీయ వారసులు ఎవరు..? ఆ మధ్య చాన్నాళ్లపాటు ఇదే అంశం ప్రముఖంగా చర్చనీయం అవుతూ ఉండేది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల మధ్య కొంత ఆధిపత్య పోరు ఉందనే కథనాలు చాలా వచ్చాయి. చాలా సందర్భాల్లో ఇద్దరు మంత్రులూ ఈ అంశంపై స్పష్టత వచ్చారు కూడా! వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోనే తెరాస మరోసారి విజయం సాధిస్తుందనీ, మరోసారి ఆయనే ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్, హరీష్ రావులు చెప్పారు. ఇంతకీ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటే… కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఇదే అంశమై తాజాగా స్పందించారు కాబట్టి.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలుసుకోవడం కోసం సచివాలయానికి ఎంపీ కవిత వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నిజానికి, ఈ మధ్య ఆమె వార్తలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసే వ్యాఖ్యలపై ఆమె తరచూ స్పందిస్తుండేవారు. కానీ, కాస్త భిన్నంగా ఇలాంటి విమర్శలు తగ్గించారు. సెక్రటేరియట్ లో చిట్ చాట్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా… కేసీఆర్ వారసులు ఎవరనేది ఎన్నికల తరువాత డిసైడ్ అవుతుందని ఆమె కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమనీ, సర్వేలు అవే చెబుతున్నాయన్నారు. విపక్షాలు మహాకూటములు కట్టినా తెరాసను అడ్డుకోలేరని ఆమె అన్నారు.
వారసత్వం గురించి కవిత అలా కామెంట్ చేసేసరికి… ఈ వ్యాఖ్యలకు కొంతమంది అధిక ప్రాధాన్యత ఇచ్చేసి, భూతద్దంలో చూసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, తెరాసలో వారసత్వానికి సంబంధించి ఏదో చర్చ అంతర్గతంగా జరుగుతోందేమో అనే చర్చకు తావిచ్చే విధంగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే… ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారసత్వ చర్చకు తెరాసలో కూడా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఓ ఆర్నెల్ల కిందట కొన్ని అనారోగ్య కారణాలను చూపుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరు అనే చర్చ హాట్ టాపిక్ గానే నిలిచింది. కానీ, ఈ మధ్య కాలంలో కేసీఆర్ పనితీరు మరింత చురుకుదనంగా మారడం, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త కొత్త పథకాలూ అమలూ అంటూ మరింత క్రియాశీలంగా కనిపిస్తుండటం, దీనికి తోడు తనకు జాతీయ స్థాయి రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పడం, తెలంగాణ మాత్రమే తన సర్వస్వం అనడం… వీటన్నింటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వారసత్వం అనే చర్చకు ఆస్కారం ఉండదనే వాతావరణమే కనిపిస్తోంది. మరోసారి కేసీఆర్ అధ్యక్షతనే తెరాస ఎన్నికలకు వెళ్తుంది, ఆయనే ముఖ్యమంత్రి అవుతారనే అభిప్రాయం తెరాస వర్గాల్లో మరింత బలోపేతం అయింది.
అయితే, ఇంకోపక్క మంత్రి కేటీఆర్ కూడా తన స్థాయిని కేసీఆర్ తరువాతి స్థానానికి చేర్చుకునే విధంగా ఎదిగారనీ చెప్పుకోవాలి. దావోస్, దుబాయ్ వంటి అంతర్జాతీయ సదస్సుల్లోగానీ, రాష్ట్ర స్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలోగానీ గతంతో పోల్చితే అత్యంత క్రియాశీల పాత్రను ఆయనా పోషిస్తున్నారు. అయినాసరే, వచ్చే ఎన్నికల్లో నాయకత్వ మార్పుగానీ, లేదా వారసునిగా బాధ్యతల అప్పగింత వంటి అంశాలకు ఆస్కారం లేనట్టుగానే కనిపిస్తోంది. కాబట్టి, ఈ నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యల వెనక వేరే అర్థాలు ఏవీ లేవనే అనిపిస్తోంది.