ముస్లిం మహిళలను ఆకర్షించేందుకు ఇప్పటికే ట్రిపుల్ తలాక్ వంటి కొన్ని కీలకాంశాలను తెరమీదికి భాజపా సర్కారు తీసుకొచ్చింది. అంతేకాదు, హజ్ యాత్రికులకు సబ్సీడీలు తీసేసి.. ఆ సొమ్మును ముస్లిం బాలికల విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పారు. ముస్లిం మహిళలను సాలిడ్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడంలో ఇలాంటి ఆకర్షక నిర్ణయాలు భాజపాకి కొంత ఉపయోగపడ్డాయి. అయితే, ఈ సందర్భంలో తలాక్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసేసరికి.. వారు ముస్లిం మహిళలకు వ్యతిరేకులు అనే విమర్శల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మహిళల కోసం ఇలాంటి మంచి పనులు చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదన్న నిష్టూరాలను కూడా భాజపా నేతలు వేశారు. అయితే, ఇప్పుడు భాజపాపై ఇదే మహిళా అస్త్రాన్ని తనదైన శైలిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయోగిస్తూ ఉండటం విశేషం..!
మేఘాలయ అసెంబ్లీకి త్వరలో ఎన్నికల జరగబోతున్న సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ షిల్లాంగ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. దేశంపై బలవంతంగా భాజపా, ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతాలను రుద్దేస్తున్నారు అని ఆరోపించారు. మహిళలకు అధికారాలు ఉండకూడదు అనేదే ఆర్.ఎస్.ఎస్. విధానమన్నారు. ‘ఆర్.ఎస్.ఎస్.లో నాయకత్వ స్థాయికి ఎదిగిన మహిళల్ని ఎప్పుడైనా ఎవరైనా చూశారా’ అంటూ ప్రశ్నించారు. ‘మహాత్మా గాంధీ ఫొటోని ఒక్కసారి చూస్తే… ఆయనకి ఇరువైపులా మహిళలు ఉంటారు’ అన్నారు. ‘అదే మోహన్ భగవత్ పొటోలు చూడండి… ఎటు చూసినా పురుషాధిక్యమే కనిపిస్తుంది. మహిళలకు అక్కడ ప్రాధాన్యత ఉండద’ని రాహుల్ ఉదహరించారు. మహిళలకు మొదట్నుంచీ కాంగ్రెస్ సమ ప్రాధాన్యత కల్పిస్తోందనీ, భాజపా – ఆర్.ఎస్.ఎస్.ల ఆలోచనా విధానం ఇలా ఉండదని ఆయన అన్నారు. మేఘాలయలో ఎక్కువమంది మహిళను ఎన్నుకునే పరిస్థితి రావాలనీ, మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోందని రాహుల్ కోరారు.
ఆర్.ఎస్.ఎస్.లో నాయకత్వ స్థాయికి ఎదిగిన మహిళలు లేరని రాహుల్ వ్యాఖ్యానించడం కొంతవరకూ బాగానే ఉంది. కానీ, మహాత్మాగాంధీ ఫొటో చూస్తే ఆయనకు కుడి ఎడమల మహిళలే ఉంటారని అనడమే… కొంత చర్చనీయం అయ్యే ఆస్కారం ఉంది. తలాక్ బిల్లు సందర్భంగా కొంత ఇరుకునపడ్డా, ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్.లో మహిళల ప్రాధాన్యత అనే పాయింట్ తో భాజపాపై రాహుల్ విమర్శలు చేస్తుండటం గమనార్హం. మరి, రాహుల్ చేస్తున్న ఈ ప్రచారానికి రాహుల్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.