జగన్ పాద యాత్ర సందర్భంగా ఇస్తున్న హామీలు సామాన్యుల సంగతేమో కానీ, విశ్లేషకుల కి, ఆర్థికవేత్తలకి మాత్రం దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కాలం లో ఆయన ఇచ్చిన హామీల్లో కొన్ని ఇవి:
- రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ తో పాటు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తరపునే చేపడతాము.
- ప్రతి రైతుకూ వడ్డీ లేని రుణా ల తో పాటు , పెట్టుబడుల కోసం ప్రతి రైతుకూ మే నెలలోనే రూ.12,500 ఇస్తాము.
- హాస్టళ్లలో ఉంటూ చదువుకునేందుకు పిల్లలకు ఏడాదికి రూ. 20 వేలు కూడా అందిస్తాం.
- తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపేందుకు సంవత్సరానికి రూ. 15 వేలను ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఏటా ఈ డబ్బు తల్లి ఖతాలో జమ అవుతుంది.
- అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ను రూ. 2 వేలకు పెంచుతాం.
- 45 ఏళ్ల నుంచి ప్రతి పేదవాడికి పెన్షన్ అందేలా చేస్తాం.
- మన అధికారంలోకి వచ్చాక ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి వైద్యానికి ఆరోగ్య శ్రీ ను వర్తింపజేస్తాం.
- ఆపరేషన్ ఉచితంగా చేయించడమే కాకుండా రెస్ట్ పీరియడ్లో డబ్బులు ఇచ్చి తోడుగా నిలుస్తాం.
- దీర్ఘకాలిక రోగులకు 10 వేల పెన్షన్ను అందజేస్తాం.
ప్రతి సమస్య కి పరిష్కారం డబ్బు ఇవ్వడం మాత్రమే అన్నట్టుగా ఉన్న ఈ హామీల్లో ఇప్పుడు కొత్తగా మరొక హామీని జత చేసారు జగన్. అదేంటంటే, ఆర్థికావసరాల నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తికీ, ఆ రుణాన్ని చెల్లించడానికి అవసరమైన డబ్బు ప్రభుత్వమే ఆ వ్యక్తికి నేరుగా ఇస్తుందనే హామీ ని జగన్ ఇచ్చారు. అయితే ఇది ఎంత మాత్రం అధ్యయనం చేయకుండా ఇచ్చిన హామీలా అనిపిస్తోంది. మొత్తం బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల రుణాలని తీర్చడం అంటే అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందనేది అంచనా వేయడానికే అసాధ్యంగా కనిపిస్తోంది. అదీగాక, ఆ డబ్బుని బ్యాంకులకి కాక, ఆయా వ్యక్తులకే నేరుగా ఇస్తానని జగన్ అంటున్నారు. ఇది ఎంతవరకు సరైన ఆలోచనో, జగన్ కి, జగన్ వ్యూహకర్తలకి మాత్రమే తెలియాలి.
మొత్తానికి జగన్ ఇస్తున్న హామీలు, సామాన్యుల సంగతేమో కానీ, విశ్లేషకుల కి, ఆర్థికవేత్తలకి మాత్రం దడ పుట్టిస్తున్నాయి. పైగా సామాన్యుల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. ఎందుకంటే ఎంత ఇచ్చినా, అది ప్రజా ధనం నుంచే కాబట్టి ఆ డబ్బు ని మరొక రకంగా ప్రజల నుంచే వసూలు చేస్తారనే అవగాహన ప్రజలకి ఉండటమే దీనికి కారణం.