జై సింహాతో బాలకృష్ణ ఖాతాలో మరో హిట్టు పడింది. ఆ ఉత్సాహంతో `ఎన్టీఆర్` బయోపిక్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేశారు. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వేటలో బాలయ్య బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత కథలో.. అలనాటి ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర కూడా కీలకం. ఇందిరమ్మ పాలనకు, అజమాయిషీకి ఎదురు నిలిచి.. గెలిచిన నాయకుడు ఎన్టీఆర్. కనీసం నాలుగైదు సన్నివేశాల్లో ఇందిరా గాంధీని చూపించాలి. ఆ పాత్ర లో ఓ సీనియర్ నటీమణి కనిపిస్తే బాగుంటుందన్నది బాలయ్య అభిప్రాయం. తనతో కలసి నటించి, ఇప్పుడు సినిమాలకు దూరమైన ఓ కథానాయికకి ఈ పాత్ర అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. నదియా, విజయశాంతి లాంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే.. తుది నిర్ణయం బాలకృష్ణనే తీసుకోవాలి. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సంభాషణలు అందించిన బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా ఏయే పాత్రకి ఎవరెవరిని ఎంచుకుంటారన్న విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.