మోడీ సర్కార్ ఆఖరి బడ్జెట్లోనూ ఆంధ్ర ప్రదేశ్‌కు రావలసినవి కనీసంగా రాని నేపథ్యంలో బిజెపితో తెగతెంపులు చేసుకోవాలని టిడిపి నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే అంతా భావిస్తున్నారు. ఇప్పుడు టిడిపి సమన్వయ సమావేశం జరుగుతున్న చోట కూడా ఆ వాతావరణం లేదు. పైగా ఆదివారం ఎంపిలతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని వారు చెబుతున్నారు. మరోసారి ఎంపిల ద్వారా వత్తిడి చేయాలనే నిర్ణయంతో టిడిపి ఆగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. రాజస్తాన్ ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమి వంటి పరిణామాలు కనిపిస్తున్నా రేపటి శాసనసభ ఎన్నికల్లో తన అవసరం రీత్యానే టిడిపి తెగతెంపులు చేసుకోకపోవచ్చు.అయితే అప్పుడు ఏం జరుగుతుందన్నది కూడా బిజెపి చేతుల్లోనే వుంటుంది. వైసీపీతో సన్నిహితమవుతున్నామనే సంకేతాలు ఇవ్వడానికి బిజెపి చాలా చర్యలు తీసుకుంది. వైసీపీ కూడా సూటిగా బిజెపిపై దాడి చేసేందుకు సిద్ధంగా లేదు. కేంద్రం చేయనివాటిని కూడా టిడిపి వైఫల్యాలుగానే వైసీపీ చెబుతున్నది. బడ్జెట్ వార్తలను సాక్షి మరే తెలుగు పత్రిక కన్నా ఆకర్షణీయంఆ ఇచ్చింది. రాష్ట్రానికి మొండి చెయ్యి అని ఎపి ఎడిషన్‌లో ఇచ్చినా కింద లైను మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని ఉప శీర్షిక పెట్టారు. కేంద్రం తప్పిదాన్ని వదలిపెట్టి రాష్ట్ర వైపల్యంగా చెప్పడం విచిత్రమే. దీనిపై నేను ఈ రోజు సాక్షి చర్చలో లేవనెత్తితే ఈనాడు లాగే వుందనిసమర్థించుకున్నారు. ఈ మాటల్లోనే ధోరణి మార్పు అర్థమవుతుంది. బడ్జెట్‌పై చంద్రబాబు నేరుగా మాట్లాడకపోయినా ఏవో లీకులతో కథ నడిపిస్తున్నారు. కాని వైసీపీ నేత జగన్ నుంచి ఎలాటి స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వైసీపీ ఎంపిలు మాట్లాడారనేది తప్ప జగన్ మౌనంపై ఆపార్టీ దగ్గర వివరణ కూడా లేదు. అయితే వారు కూడా టిడిపిపై కేంద్రీకరిస్తూనే కొంత హడావుడి చేయొచ్చు. అంతేగాక ఈ రెండు ప్రధాన పార్టీలు కేంద్రంపై ఘర్షణ పడే వైఖరి తీసుకోవడం జరిగేది కాదు. రాజీనామాలు చేస్తామని అంటున్నారు గాని తర్వాత బుజ్జగించినట్టు నటించి బిజెపి వారిని ప్రశాంత పరుస్తుంది.