తమని ఎస్టీల్లో చేర్చాలంటూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు దీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావం పలకడానికి అక్కడికి వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి వెళ్ళారు. సంఘీభావం మాట ఎలా ఉన్నా వారి వద్దకు వెళ్లిన విజయ సాయి రెడ్డి, దీక్ష చేస్తున్నవారిని చిన్నబుచ్చేలా మాట్లాడటమే కాక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషయమేంటంటే అక్కడ దీక్ష చేస్తున్నవాళ్ళు ముద్రించిన కరపత్రం పసుపు రంగు లో ఉంది. అక్కడ ఉన్న పసుపు రంగు కరపత్రాన్ని చూసి తీవ్రంగా స్పందించారు. కాకతాళీయంగా ముద్రితమైన రంగు చూసి జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి మీకు మొండిచేయి చూపిస్తున్నా మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ రంగునే ఎందుకు ఉపయోగిస్తున్నారంటూవారితో అన్నారు. ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లోనే ..
“(వారి కర పత్రాన్ని చూపిస్తూ ) ఈ పేపర్ కలర్ కూడా తెలుగు దే శం కలరే. ఎందుకు మీరిలాంటి పని చేస్తున్నారో నాకైతే తెలీదు కానీ, తెలుగు దేశం రంగు మీరిలా ప్రింట్ చేసినంత మాత్రాన చంద్రబాబు మీకేమైనా న్యాయం చేస్తున్నారా? మీకు తెలీకుండానే మీరు తెలుగు దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. మీకు మొండిచేయి చూపడమే కాక మీ తోలు తీస్తానని చంద్రబాబు అంటున్నారు. అయినా మీరు చంద్రబాబు ని సపోర్ట్ చేస్తూంటే, మిమ్మల్ని ఎవరు సేవ్ చేయగలరు చెప్పండి.”
అయితే కాకతాళీయంగా జరిగిన ఇంత చిన్నవిషయానికి ఎంపీ గారు అంత సీరియస్ అవడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఎల్లో కలర్ వాడిన వాళ్ళందరూ టిడిపి సపోర్టర్స్ అయిపోరు. ఆ మాటకి వస్తే ఎంపీ గారు తమ పార్టీ అధ్యక్షుడు నడుపుతున్న సాక్షి పేపర్ ని సరిగ్గా చూసారో లేదో మరి. సాక్షి దినపత్రిక మెయిన్ పేజీ లో సాక్షి అన్న పేరే (ఆయన దృష్టిలో ) టిడిపి రంగు అయిన “ఎల్లో కలర్ బ్యాక్ గ్రౌండ్” లో ఉంటుంది. మరి ఆ లెక్కన జగన్ గారు కూడా, మత్స్యకారుల్లాగే “తెలీకుండానే” టిడిపి కి అనుదినమూ తన పత్రిక ద్వారా మద్దతిస్తున్నట్టు ఎంపీ గారు భావిస్తున్నారా. అయితే ఆ రంగు మార్చే “క్లాస్” ఏదో ఆయన చెప్పాలింది మత్స్యకారులకి కాదు, సాక్షి ని నిర్వహిస్తున్న జగన్ గారికి.
సమస్య గురించి చర్చించకుండా ఈ కలర్స్ గొడవెందుకనేది ఎంపీ గారే ఆలోచించుకోవాలి మరి.