శుక్రవారం మంచు మోహన్‌బాబు ‘గాయత్రి’, మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ‘ఇంటిలిజెంట్’, శనివారం వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’ విడుదల అవుతున్నాయి. థియేటర్ల విషయంలో కొంచెం కోల్డ్ వార్ నడుస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. మూడు సినిమాల మధ్య కొందరు పంపిణీదారులు నలుగుతున్నారు. వాళ్ళతో పాటు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సైతం మూడు సినిమాల జనాల మధ్య చిక్కుకుని నలుగుతున్నారు. ప్రేక్షకులు ఎవరూ పెద్దగా గమనించని విషయం ఏంటంటే… మూడిటికీ సంగీత దర్శకుడు తమనే. పాటలతో ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడో కంప్లీట్ చేశాడు. ఎటొచ్చి రీ-రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ దగ్గర సమస్యలు ఫేస్ చేస్తున్నాడు తమన్. ఒకటి ముందు ఒకటి వెనుక చేయడానికి కుదరదు. మూడు రిలీజులు ఈ వారమే. ఎవరి తొందర వారిది. తమన్ తబలాపై ముప్పేట దాడి కొనసాగుతోందిప్పుడు.
తమన్‌కు సాయిధరమ్ తేజ్ మంచి ఫ్రెండ్. సో, ఆ సినిమాకి ప్రాబ్లమ్ లేదు. తేజుకి కావలిసినట్టు చేయించుకుంటున్నాడు. ‘తొలిప్రేమ’ వ్యవహారాలన్నీ దిల్ రాజు కనుసన్నలలో నడుస్తున్నాయి. ఏదైనా తేడా వస్తే ఆయన ఊరుకోరు. తేడా చేస్తే మెగా హీరోలకి కోపం వస్తుంది. అది మరింత ప్రమాదకరం. వీటికి మించి తమన్ సంగీతం అందించే రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే ‘తొలిప్రేమ’ డిఫరెంట్ సినిమా. అందుకని నేనేంటో నిరూపించుకోవాలని తమన్ ‘తొలిప్రేమ’ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది. మూడోది మోహన్‌బాబు ‘గాయత్రి’. తమకు సరైన టైమ్ కేటాయించడం లేదని ఈ టీమ్ తమన్‌పై కొంచెం కోపంగా ఉందట. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారయింది పరిస్థితి. పాపం!!