తెలుగు చిత్రపరిశ్రమ వజ్రోత్సవాల సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల మోహన్ బాబు స్పందించారు.
వజ్రోత్సవాల సమయంలో లెజెండ్, సెలెబ్రిటీ అంటూ వేర్వేరు కేటగరీల్లో అవార్డులివ్వటమూ, చిరంజీవిని లెజెండ్ కేటగరీలోనూ, మోహన్ బాబు ని సెలెబ్రిటీ కేటగరీ లోనూ అవార్డులు ప్రకటించడమూ, దానిమీద మోహన్ బాబు వేదికమీదే నిర్వాహకులని కడిగేయడమూ తెలిసిందే. అలాగే, తాను కాలేజ్ చదివే రోజుల నుంచే చిరంజీవి సినిమాలని ఇష్టంగా చూసేవాణ్ణి అంటూ మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడం (అంటే తాను చిరంజీవి కన్నా వయసులో చాలా చిన్నవాణ్ణని చెప్పే ఉద్దేశ్యం తో) కూడా తెలిసిందే. దాన్ని ఉద్దేశ్యించి పవన్ కళ్యాణ్, మోహన్ బాబు ని ఉద్దేశ్యించి “తమ్ముడూ మోహన్ బాబూ ” అని వేదిక మీద నుంచి స్పందించాడు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత లేదు కానీ ఆ రోజుల్లో జనాల్ నోళ్ళలో బాగా “వైరల్” అయిన వీడియో ఇది అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని మీద స్పందించమని మోహన్ బాబు ని అడిగారు.
మోహన్ బాబు దీని గురించి మాట్లాడుతూ -ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను, ఆ విషయాన్ని పవన్ విజ్ఞతకే వదిలేశాను అన్నారు. ఆ సమయంలో పవన్ అలా అన్నప్పుడు ఆనందించాను. ఎందుకన్నాడా అని కొద్దిసేపు ఆలోచించాను. కొన్ని వినీ విననట్టు వదిలేయాలని వదిలేశానన్నారు. దానిపై తనకు ఎలాంటి ఆలోచన లేదని మోహన్ బాబు తెలిపారు.