20 ఏళ్ల కిందట వచ్చిన “గాయం” సినిమా గుర్తుందా? అందులో జర్నలిస్టు అయిన రేవతి, మంత్రి కోట శ్రీనివాస రావు ని ఒక సందర్భంలో ఇంటర్వ్యూ చేయడానికి వెళుతుంది. మంత్రిగారి పరిధిలో ఉన్న ఒక అంశంపై ఆయన్ని ప్రశ్నిస్తుంది “మంత్రిగా మీరు బాధ్యత వహించాల్సిన ఈ సంఘటనపై మీ స్పందన ఏంటి? మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నిస్తుంది. దానికి కోట శ్రీనివాస రావు బదులిస్తూ “ఖండిస్తున్నాం” అంటాడు. రేవతి ,”ఖండిస్తున్నారు సరే, కానీ ఏం చర్యలు తీసుకున్నారు” అని అడుగుతుంది. దానికి ఆయన మళ్లీ, “అదే చెప్తున్నా కదా, ఖండిస్తున్నాము” అంటాడు. రేవతి , మళ్ళీ రెట్టించి ,”ఖండించడం సరే, మంత్రి గా చర్యలు ఏం తీసుకున్నారో స్పష్టంగా చెప్పగలరా?” అని అడుగుతుంది. దానికి ఆయన అసహనంగా సమాధానమిస్తాడు “చర్యలు అంటే..ఏం తీసుకుంటాం, ఖండిస్తున్నాం” అని సమాధానమిస్తాడు.
ఇప్పుడు కేంద్ర మంత్రి జైట్లీ ఆంధ్ర ఎంపీలకి ఇచ్చిన సమాధానాన్ని చూస్తుంటే ఈ సన్నివేశమే గుర్తొస్తోంది. ఏది అడిగినా, ఎంత సహాయం కోసం పోరాడినా, “కట్టుబడి ఉన్నాం” అని సమాధానం ఇస్తున్నాడు జైట్లీ . ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అంటూ చెప్పిందే చెబుతున్నారు. కట్టుబడి ఉన్నారు, సరే ఇంతకీ ఆంధ్ర రాష్ట్రానికి ఏరకంగా మేలు చేస్తున్నారు చెప్పమంటే మాత్రం, అదే కదా చెబుతున్నది కట్టుబడి ఉన్నాం అంటున్నాడు. రైల్వేజోన్, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు, బడ్జెట్ కేటాయింపు ఇలా ఏ విషయం మీద స్పష్టత ఇవ్వకుండా ప్రతిదానికి, “కట్టుబడి ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం” అంటూ పడికట్టు మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు కేంద్రామాత్యులు.
జైట్లీ ఆంధ్ర ఎంపీలకి ఇచ్చిన సమాధానాన్ని చూస్తుంటే – ఆంధ్ర ప్రదేశ్ కి ఇచ్చేది లేనట్టే, ఆంధ్ర ప్రదేశ్ కి “ఇచ్చే దిన్” రానట్టే అని సగటు తెలుగువాడికి అనిపిస్తే అది అతని తప్పు కాదు.
-జురాన్