హీరోలకే కాదు, ఇండ్రస్ట్రీలో ఎవరికైనా సరే.. మెగాఫోన్పైనే దృష్టి. కెప్టెన్ కుర్చీ అంతలా ఆకర్షిస్తుంటుంది. కొంతమంది హీరోలు సహాయ దర్శకులుగా పనిచేసినవాళ్లే. అందుకే… డైరెక్షన్ అంటే అంత ఇష్టం. మంచు ఫ్యామిలీలోనూ దర్శకత్వం అంటే ఆసక్తి ఉన్నవాళ్లు ఉన్నారు. మనోజ్‌కి డైరెక్షన్ అంటే ఇష్టం. అప్పుడప్పుడూ తన సినిమాలకు సంబంధించి కొరియోగ్రఫీ కూడా అందిస్తుంటాడు. విష్ణుకీ ఈ అలవాటు ఉంది. యాక్షన్ సీన్లను తానే డిజైన్ చేసుకుంటాడని టాక్. అయితే… ‘ఓటర్’తో ఓ విధంగా విష్ణు కూడా దర్శకుడిగా మారిపోయాడట. నిజానికి ఈ చిత్రానికి కార్తీక్ రెడ్డి దర్శకుడు. అయితే… ఫారెన్ షెడ్యూల్ కోసం వెళ్లినప్పుడు కార్తీక్ రెడ్డి మాత్రం వీసా సమస్య వల్ల అక్కడికి వెళ్లలేకపోయాడు. ఆ సీన్‌ని అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయంతో విష్ణునే టేకప్ చేశాడు. ఆ సీన్ మొత్తానికి విష్ణు దర్శకుడిగా వ్యవహరించాడని టాక్. ఆ విధంగా విష్ణు దర్శకత్వ ప్రతిభ చూపించేశాడన్నమాట. అయితే పూర్తి స్థాయిలో తనకు దర్శకత్వం వహించాలని మాత్రం లేదని విష్ణు క్లారిటీగా చెబుతున్నాడు. తాను కీలక పాత్ర పోషించిన ‘గాయత్రి’ ఈ శుక్రవారం వస్తోంది. ఇందులో విష్ణు కనిపించేది 15 నిమిషాలు మాత్రమే.