బడ్జెట్ సెగలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ప్రతిపక్షాలు, వామపక్షాలు బంద్ పిలుపునిచ్చాయి. ఏపీ ప్రజలు కూడా దాంతో ఏకీభవిస్తున్నారు. అయితే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొంటుందా? ఆంధ్ర రాష్ట్రానికి కావలసిన నిధులు ఇస్తుందా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
రాజధాని కోసం ఇప్పటికే 2500 కోట్లు కేటాయించామని చెప్పి చేతులు దులుపుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి వివాదాస్పదమవుతోంది. అలాగే విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లో వసతుల కోసం కేటాయించిన డబ్బు కూడా రాజధాని ఖాతాలో చూపుతోంది కేంద్రం. బెంగళూరు మెట్రో కోసం 17000 కోట్లు కేటాయించిన ప్రధాని, గుజరాత్లో వడోదరకు రైల్వే యూనివర్సిటీ మంజూరు చేసిన ప్రధాని, పీయూష్ గోయెల్ నియోజకవర్గమైన లాతూర్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనుమతిచ్చిన ప్రధాని- విశాఖ రైల్వేజోన్ విషయంలో మాత్రం ఎందుకు మొండి చెయ్యి చూపుతున్నారనేది ఆంధ్ర ప్రజలకు “గరుడవేగ” కథ కన్నా పెద్ద పజిల్ లా మారింది.
ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసి ప్రత్యేక హోదా కు బదులు ప్రత్యేక ప్యాకేజీ కి ఒప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం .ఇప్పుడు కనీసం దానికైనా చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతుంటే దానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు బిజెపి పెద్దలు. బాహుబలి కలెక్షన్ల పాటి నిధులు కేటాయించలేదన్న మాటకైనా చురుకు తగులుతుందా కేంద్రానికి అన్నది చూడాలి. ఇంతకీ ఆంధ్ర రాష్ట్రం తన పాలనలోని భారతదేశంలోనే లేదని కేంద్ర మంత్రులు భావిస్తున్నారేమో అన్న సందేహం తెలుగులో ప్రజలలో కనిపిస్తోంది