పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రజలు జల్లికట్టుకి మద్దతుగా ఆందోళనలకు దిగితే తమిళ హీరోలందరూ రోడ్ల మీదకు వచ్చారు. తమిళ ప్రజలకు మద్దతుగా నిలిచారు. మేం ఏమన్నా తక్కువ తిన్నామా? తమిళ ప్రజలపై మాకూ అభిమానం మెండుగా ఉంది అన్నట్టు మన తెలుగు హీరోలందరూ జల్లికట్టుకి మద్దతుగా తలో ట్వీట్ వేశారు. కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీలకు తెలుగులో ఉన్నంత మార్కెట్ మన హీరోలకు తమిళంలో ఉందా? అని చూస్తే లేదు. చిన్నతనంలో ఎక్కువగా మద్రాస్, తమిళనాడులో పెరిగాం కనుక తమిళ ప్రజల మనోభావాలను గౌరవించి మద్దతు ఇచ్చామని చాలామంది చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వాళ్లకు మద్దతు తెలపడంలో, సంఘీభావం ప్రకటించడంలో తప్పు లేదు. కానీ, సొంతిల్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజిన్కి కాల్ చేయడం మాట దేవుడెరుగు… కనీసం బకెట్ పట్టుకుని చేత్తో నీళ్లు జల్లాలని కూడా ప్రయత్నించడం లేదు. అదే ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు మింగుడుపడడం లేదు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఏపీ జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం ఎంపీ బుధవారం లోక్సభలో గల్లా జయదేవ్ గట్టిగా నిలదీశారు. ప్రత్యేక హోదా స్థానంలో బీజేపీ ప్రభుత్వం ప్యాకేజ్ తీసుకొచ్చింది. దానిప్రకారం అయినా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయా? అంటే అదీ లేదు. మోడీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదు. ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా లేదా ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగు హీరోలు నోరు మెదపడం లేదు. కనీసం ఒక్క ట్వీట్ చేయడం లేదా వీడియో బైట్ ఇవ్వడం వంటివి లేదు.
తెలుగు హీరోలకు ప్రధాన ఆదాయ వనరు నటనే. తెలుగు సినిమాల్లో నటించడం వల్లనే స్టార్ స్టేటస్, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చాయి. ఎవరు ఔనన్నా? కాదన్నా? తెలుగు హీరోలు సంపాదించే ప్రతి రూపాయిలో అర్ధభాగం ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల అభిమానానికి చిహ్నం. అటువంటి ప్రజల ఆగ్రహం తెలుగు హీరోలకు అర్థం కావడం లేదా? లేదంటే తమిళులతో పోలిస్తే ఆంధ్రులు అంటే చిన్న చూపా? ఆంధ్రప్రదేశ్ సమస్యపై మన తెలుగు హీరోలు ఎందుకు నోరు విప్పడం లేదు? ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్, యువ హీరో నిఖిల్ మాత్రమే ఈ సమస్యపై స్పందించారు. పవన్ రాజకీయాల్లో ఉన్నారు గనుక హీరో కేటగిరీ లెక్కల్లోకి రారు. ఇక, నిఖిల్ ఒక్కటే గళం విప్పినట్టు లెక్క. అతనికి ఉన్న ధైర్యం మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజలకు లేదనుకోవాలా? వీరి మౌనాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏది ఏమైనా హీరోలు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!!