మావయ్యపై సర్వ హక్కులూ తనకే ఉన్నాయనుకుని ఎడా పెడా రీమిక్స్ చేసేసుకుంటున్నాడు సాయిధరమ్ తేజ్. ఇప్పటి వరకూ మూడు పాటలొచ్చాయి. ‘ఇంటిలిజెంట్’లో నాలుగో పాట రీమిక్స్ చేశాడు. ‘కొండవీటి దొంగ’లో ‘ఛమకు ఛమకు చాం’ పాటని ఈ సినిమా కోసం వాడుకున్నారు. ఇలా మావయ్య పాటల్ని వాడుకోవడం ఎంత కాలం?? అని అడిగితే చాలా తెలివైన సమాధానం చెప్పాడు.
దర్శకులు, నిర్మాతల కోసమే రీమిక్స్ పాటలకు ఒప్పుకుంటున్నానని, అది తన చేతుల్లో లేని విషయమని తేల్చేశాడు. దర్శకులు చెప్పింది చేయడం నటుడిగా తన బాధ్యత అని.. రీమిక్స్ ఆలోచనలు వాళ్లకే అంటగట్టేశాడు. ఈ నాలుగు పాటలూ చాలా ఇష్టంతో చేశానని, అయితే పాత పాటల్ని మ్యాచ్ చేసేంత స్టామినా తనకు లేదని వినయంగా ఒప్పుకున్నాడు. తనలో ఇద్దరు మావయ్యల పోలికలూ కనిపిస్తాయన్న వినాయక్ కామెంట్‌పై స్పందిస్తూ.. ”తెలుగు చిత్రసీమలో చిరంజీవి ఒక్కరే ఉంటారు. ఆయనలా నేను ఉండలేను. ఇలాంటి కామెంట్లు భయపెట్టిస్తాయి” అని చెప్పుకొచ్చాడు సాయి.