ఆంధ్రాకి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో ఎవ్వరికీ తెలీదు..! గత నాలుగేళ్ల సంగతి పక్కనపెట్టి, తాజా బడ్జెట్ లో చూసుకున్నా ఇతర రాష్ట్రాల కంటే… మరీ ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగున్న రాష్ట్రాలకంటే తక్కువ కేటాయింపులు ఏపీకి దక్కాయి. కానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏమంటున్నారంటే… ‘ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం, ఇంకా ఒకటో రెండో అంశాలు మిగులున్నాయి, అవి కూడా చర్చల దశలో ఉన్నాయ’ని సెలవిచ్చారు! లోక్ సభ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగం ఇలానే సాగింది..! ఓపక్క ఆంధ్రాలో బంద్ జరుగుతోంది, ఇంకోపక్క భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఎదురు తిరుగుతోంది. ఏపీలో అన్ని పార్టీలూ ఒకటయ్యాయి, జాతీయ స్థాయిలో ఆంధ్రా అంశం చర్చనీయం అవుతోంది. ఇతర పార్టీల మద్దతు పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన కొంత ఊరట కలిగించే విధంగా, పరిస్థితిని కాస్త శాంతింపజేసే విధంగా ఉంటుందని అనుకుంటే… ఆయన కూడా ఆంధ్రాపై పరిపూర్ణ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారు.
లోక్ సభలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ… రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు నష్టం జరిగిన మాట వాస్తవమేననీ, అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. ప్యాకేజీలో ఇస్తామన్నవాటిలో ఇప్పటికే చాలా అమలు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తి పడేలా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మరో హామీ ఇచ్చారు. రాజధాని అమరావతికి కొన్ని నిధులు ఇచ్చామనీ, పోలవరం నిర్మాణ వ్యవయమంతా కేంద్రమే భరిస్తోందనీ, అది తమ బాధ్యత అని జైట్లీ అన్నారు. అన్నీ బాగానే ఉన్నాయనీ, ఒక్క రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత తేడా ఉందనీ, అది కూడా త్వరలోనే చర్చలతో పరిష్కృతం అవుతుందని చెప్పారు. అండర్ లైన్ చేయాల్సిన మాట ఏంటంటే… ఏపీ పట్ల కేంద్రం సానుభూతితో వ్యవహరిస్తోందట..!
విభజన చట్టంలో ఉన్నవి అమలు చేయండి మహాప్రభో అనే కదా కేంద్రాన్ని కోరుతున్నది, అంతేగానీ, భాజపా సర్కారు కురిపించే సానుభూతి ఎవరిక్కావాలండీ..! ఆంధ్రాకు అన్నీ ఇచ్చేశామని ఏమాత్రం తడుముకోకుండా, తత్తరపాటు లేకుండా, సాక్షాత్తూ దేశ ఆర్థికమంత్రి చెప్పడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఏపీని ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అనేది స్పష్టం. బడ్జెట్ లో ఆంధ్రాకు కేటాయించిన లెక్కలు ఆయనకి తెలియనవా..? ఆ అంకెలు ఆయనకి గుర్తులేవా..? గడచిన నాలుగేళ్లలో అన్నీ ఇచ్చేస్తే.. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఎందుకు ఏకమౌతున్నాయి..? అయినాసరే, మొత్తం ఇచ్చేశామని ఎంత ఈజీగా చెప్పేశారో..! నిన్నటికి నిన్న, రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీదనీ, అందుకే ఏపీకి ఇన్ని సమస్యలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ఎటో మళ్లించే ప్రయత్నం చేశారు. ఇవాళ్ల మరో అడుగు ముందుకేసిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ… ఆంధ్రాకు అన్నీ ఇచ్చేశాం, మీ ఇష్టమొచ్చింది చేసుకోండీ అన్నట్టుగా తెగేసి మరీ చెప్పేసినట్టు ప్రసంగించారు. సో… ఏపీ విషయంలో భాజపా నిర్లక్ష్య వైఖరి పరిపూర్ణం. కాబట్టి, కేంద్రం అంత ఈజీగా దిగొస్తుందన్న సూచనలు కనిపించడం లేదు. పార్లమెంటు జరగబోయేది కూడా ఇంకా ఒక్క రోజు మాత్రమే. ఆ రోజును ఎలాగోలా గడిపేస్తే… దాదాపు నెలపాటు పార్లమెంటు సమావేశాలుండవు! భాజపా ప్రస్తుతం ఇంతే ఆలోచిస్తోంది..!