జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి కాసేపు చర్చించుకున్నారు. ముఖ్యంగా విభజన హామీల్లో ఆంధ్రాకు ప్రకటించిన కేంద్ర ప్రయోజనాలపైనా, వాటిని అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న భాజపా సర్కారు విధానాలపైనా చర్చించారు. దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది త్వరలోనే కొంత స్పష్టత వస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు.
భేటీ అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు. రిటైర్మెంట్ తరువాత కాకుండా, సినిమాల్లో టాప్ స్టార్ గా ఆదరణ పొందుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ప్రజా జీవనంలోకి రావడం అభినందనీయం అన్నారు. ఆయన్ని చూడ్డానికి డబ్బులిచ్చి మరీ థియేటర్లకు జనం వెళ్తున్న సమయంలోనే, ప్రజా సమస్యలపై స్పందించడాన్ని మెచ్చుకున్నారు. సమాజం కోసం ఏదో చేయాలన్న ఆరాటం ఉంటే తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. ఉభయులూ మరోసారి భేటీ అవుతామనీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అంశాలనూ చర్చిస్తామనీ, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా కేంద్రం నుంచి ఆంధ్రాకు దక్కాల్సిన ప్రయోజనాలను ఎలా రాబట్టాలనేది చూస్తామని జేపీ చెప్పారు.
జేపీ లాంటి వ్యక్తులతో జనసేనాని కలవడం మంచి పరిణామమే. ఎందుకంటే, ఆయన కూడా సమాజం కోసం ఏదో చేయాలన్న తపనతోనే ఉద్యోగాన్ని వదులుకుని వచ్చారు, లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు. వ్యవస్థలోని కొన్ని లోపాలపై ప్రభావంతమైన పోరాటమే చేశారు. ఆ తరువాత, లోక్ సత్తా రాజకీయ పార్టీగా మారింది. కానీ, ఆశించిన స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయింది. దీంతో మళ్లీ లోక్ సత్తాను ఒక ప్రజావేదికకు మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది. లోక్ సత్తా అనుభవాల నుంచి పవన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది..! కొత్త తరానికి కొత్త రాజకీయాలు అంటూ తెరమీదకు వచ్చిన లోక్ సత్తా పార్టీ అనతి కాలంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమాన్ని పవన్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
దేశం మీద ప్రేమ, సమాజం కోసం ఏదో చేయాలన్న తపన ఉన్న వ్యక్తిగా జేపీ చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు. కానీ, ఒక నాయకుడిగా రాజకీయ పార్టీని నడిపించిడంలో ఆయన వైఫల్యం చెందారనే చెప్పుకోవాలి. లోక్ సత్తా ఒక పార్టీగా నిలబడలేకపోవడం వెనక జేపీ స్వయంకృతం కూడా కొంత ఉందనే చెప్పక తప్పదు. ఒక ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో పటిష్టమైన శాఖలు లోక్ సత్తాకి ఉండేవి. వీటిని ద్వారా పార్టీకి అవసరమైన కేడర్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, ఆ పని ముందు చేయకుండా.. హడావుడిగా పార్టీ పెట్టేశారు. అంతేకాదు… లోక్ సత్తాపై నమ్మకంతో కొంతమంది ప్రముఖులు కూడా వచ్చి జేపీతో కలిశారు. కానీ, వచ్చినవారి సేవల్ని పార్టీ భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా మలుచుకోలేకపోయారు. ఉన్న ఆలోచనలూ ఆశయాల కోసం పార్టీ స్థాపించి, తద్వారా సత్ఫలితాలు సాధించుకోవాలనే క్రమంలో లోక్ సత్తా కొన్ని తప్పటడుగులు వేసింది. ఫలితం.. ఇప్పుడు ఒక ఉద్యమ సంస్థగానే మిగలాల్సి వచ్చింది.
లోక్ సత్తా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని.. పవన్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటుంది..! అదేంటంటే.. ‘ఒకసారి రాజకీయాల్లోకి వద్దామని నిర్ణయించుకున్న తరువాత… అధికారం ద్వారానే సమాజంలో మార్పులు సాధ్యం అనేది పరిపూర్ణంగా నమ్మి తీరాలి’. ఒక సంస్థగా ప్రజా సమస్యలపై ఉద్యమించడానికీ, ఒక రాజకీయ పార్టీగా పోరాటం చేయడానికి ఉన్న సున్నితమైన తేడాను తెలుసుకోవాలి. ‘అధికారం కోసం పార్టీ పెట్టలేదూ, ఓట్ల కోసం ఇక్కడికి రాలేదూ, అధికారంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేస్తాం’ ఇలాంటి ప్రకటనలు పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తాయి. లోక్ సత్తా అనుభవం ఇదే చెబుతుంది! పార్టీ పెట్టాక కూడా జేపీ దాన్ని ఒక ఉద్యమ సంస్థగానే చూశారు. క్యాడర్ ఏర్పాటు కోసం, ఓట్ల శాతం పెంచుకోవడం కోసం గణనీయమైన కృషి జేపీ చేయలేదు. ఇప్పుడు జనసేనాని నేర్చుకోవాల్సింది ఇదే.! పార్టీ ఎదగాలీ, పాతికేళ్ల పాటు ప్రజల్లో నిలవాలని అనుకుంటే దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. మరి, జేపీతో భేటీ అయిన జనసేనాని.. లోక్ సత్తా అనుభవాల నుంచి కొంతైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి..!