పూరి మంచి కథకుడు. తొలి రోజుల్లో తన సినిమాల్లో కథాబలం ఎక్కువగా కనిపించేది. ఆ తరవాత కేవలం క్యారెక్టరైజేషన్ పై ఆధార పడుతూ సినిమాలు తీసేశాడు. దానికి తగ్గట్టుగానే కొన్నేళ్లుగా (టెంపర్ మినహాయిస్తే) హిట్ కి దూరమయ్యాడు. పూరి పని ఇక అయిపోయిందన్న గుసగుసలూ ఎక్కువయ్యాయి. ఆఖరికి బాలకృష్ణతో చేసిన ‘పైసా వసూల్’ టైటిల్‌కి జస్టిఫికేషన్ చేయలేకపోయింది. ఈనేపథ్యంలో తనయుడు ఆకాష్ పూరికి కథానాయకుడిగా పరిచయం చేసే బాధ్యత కూడా తానే తీసుకున్నాడు. ‘మెహబూబా’ అనే కథని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. టీజర్ ఈరోజు విడుదలైంది. హీరో హీరోయిన్ల మొహాలు కనిపించకుండా.. జాగ్రత్త పడిన పూరి.. ఈ కథలో డెప్త్ ఎంతో చెప్పడంలో మాత్రం సఫలం అయ్యాడు. బోర్డర్ చుట్టూ సాగే ప్రేమకథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. యుద్ధ భూమిలో పూచిన ఓ గులాబీలా… రణ రంగంలో ప్రణయగాథని పూరి తెరకెక్కిస్తున్నాడు. ఆ ఇంటెన్స్ టీజర్లో కనిపించింది. తొలిసారి తనది కాని జోనర్లో సినిమా తీస్తున్నాడు పూరి. టేకింగ్‌లోనూ వైవిధ్యం కనిపిస్తోంది. కథ, కథనాల్లోనూ అంతే కొత్తదనం చూపిస్తే… కచ్చితంగా మెహబూబాతో తాను హిట్టు కొట్టడమే కాదు, ఆకాష్‌కీ ఘనమైన ఎంట్రీ ఇచ్చినవాడవుతాడు.