ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి.. విశాఖ రైల్వేజోన్. గడచిన నాలుగేళ్లుగా ఈ మాట ఆంధ్రాలో మాత్రమే అడపాదడపా వినిపిస్తోంది. అంతేగానీ, కేంద్రం ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే, తాజా బడ్జెట్ లో కూడా ఏపీకి అరకొర కేటాయింపులు చేయడంతో మిత్రపక్షమైన టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, పొత్తు తెగిపోతుందా అనే వాతావరణం కనిపించడంతో మోడీ సర్కారు కొన్ని దిద్దుబాటు చర్యలకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. పోలవరం, రైల్వేజోన్ వంటి కొన్ని కీలక హామీలను నెరవేర్చేందుకు సిద్ధమౌతున్నట్టు ఇచ్చారు. దశలవారీగా పనులు జరుగుతూ ఉంటే, అదే పద్ధతితో బిల్లులు చెల్లిస్తామంటూ పోలవరం విషయంలో హామీ ఇచ్చారు. ఇక, రైల్వేజోన్ కూడా ప్రకటించేస్తామని అన్నారు. అయితే, విశాఖ రైల్వేజోన్ ప్రకటించాలంటే… ఒడిశాతో సమస్య ఉంది కదా! ఆంధ్రాకు జోన్ ఇచ్చేస్తే భువనేశ్వర్ కు ఆదాయం తగ్గిపోతుందనీ, అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఒడిశాలో భాజపా అధికారంలోకి రాలేదన్న అంచనాతోనే ఇన్నాళ్లూ ఈ హామీపై తాత్సారం చేశారు. మరి, ఇప్పుడు ఎలా సాధ్యమౌతుందీ… అంటే, కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తున్నట్టు సమాచారం!
వాల్తేరు డివిజన్ లో 80 శాతం ఒడిశాకు వెళ్లేట్టు, కేవలం తెలుగు ప్రాంతాలు మాత్రమే విశాఖ పరిధిలోకి వచ్చేలా ఓ ప్రతిపాదన తయారు చేసినట్టు సమాచారం. అంటే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు మాత్రమే కొత్త జోన్ పరిధిలోకి వస్తాయన్నమాట. వీటితోపాటు గుంతకల్లు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కూడా వైజాగ్ జోన్ పరిధిలోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. కిరణ్ డోల్, సంబల్ పూర్, రాయ్పూర్ వంటి లైన్లను భువనేశ్వర్ పరిధిలోనే ఉంచేట్టు ప్రయత్నిస్తున్నారట. ఇదే విషయమై భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ధర్మేంద్ర ప్రధాన్ తోపాటు, ఒడిశా నాయకులను కూడా పిలిచి మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. విశాఖ రైల్వేజోన్ ప్రకటించడం వల్ల ఒడిశాకు ఎలాంటి నష్టమూ ఉండదనే భరోసా ఆ రాష్ట్రానికి కల్పించాలన్నది కేంద్రం ప్రయత్నంగా కనిపిస్తోంది.
అయితే, విశాఖ కూడా భువనేశ్వర్ జోన్ లోనే ఉంచాలనే పట్టుదలతో ధర్మేంద్ర ప్రదాన్ ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే, ఎలా చూసుకున్నా విశాఖ నుంచి ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని వదలుకునేది లేదనే పట్టుదల ఒడిశాకు చెందిన నేతల్లో ఉందనేది స్పష్టం. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రయత్నమేదో ముందే చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు కదా! ఏదేమైనా, ఇప్పటికైనా కొంత సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉండటం మెచ్చుకోదగ్గదే.