‘నోరు తెరిస్తే అబద్ధం, చేసిందంతా పచ్చి మోసం’… ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలో సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఈ మాటలు లేని ప్రసంగాలు దాదాపు ఉండవు..! తాజాగా, నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో కూడా జగన్ ఇలానే విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పాదయాత్రలు, యువభేరి కార్యక్రమాలు, బంద్ లు నిర్వహిస్తుంటే… దెబ్బ తగిలిన చోట కారం చల్లుతారా అని చంద్రబాబు విమర్శించారన్నారు. ఓ పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదాను చంద్రబాబు అమ్మేసుకున్నారని ఆరోపించారు. దానికి బదులుగా వచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఏదీ రాకపోయినా… ఏదో వచ్చేసిందన్న కలర్ ఇచ్చారన్నారు. ఇవాళ్లే రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందని తెలిసినట్టు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు తనకు ఒకటి అనిపిస్తుందనీ… ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయాలీ, ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్లి ఆనందంగా కూర్చుంటే మేలు కదా అని తనకు అనిపిస్తుందని జగన్ చెప్పడం జరిగింది..! ఆ తరువాత, చంద్రబాబు విదేశీ పర్యటనల గురించి జగన్ ఎద్దేవా చేశారు. సినిమాలో విలనూ… 13 రీళ్ల వరకూ హీరో కష్టాలు.. చివరిగా హీరో గెలవడం.. ఈ కథ మళ్లీ చెప్పారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్న ఆందోళనను టీడీపీ వ్యక్తం చేసింది. సరే, దీన్ని ఎలాగైనా ఎట్నుంచి ఎటైనా అన్వయించుకుని జగన్ ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. ఆ టాపిక్ కాసేపు పక్కన పెడితే… రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అధికార పార్టీ బాధ్యతను ఇన్నిసార్లు ప్రశ్నిస్తున్న జగన్… ప్రతిపక్షంగా వారు చేసిందేంటీ..? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వారికీ బాధ్యత ఉంటుంది కదా..! ప్రత్యేక హోదాను చంద్రబాబు అమ్మేసుకున్నారని అంటున్నారు, మరి దాని కోసం వైకాపా ఏం చేసింది..? ఎంపీలు రాజానామాలు చేసేస్తారన్నారు. లేదు లేదూ.. మేం రాజీనామా చేస్తే పార్లమెంటులో మాట్లాడేవారు ఉండరన్నారు! బడ్జెట్ కేటాయింపుల విషయంలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తే… వెంటనే ఎందుకు రాజీనామాలు చేయలేకోపోయారు..? లేదు లేదూ ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆగామన్నారు.
ఓపక్క టీడీపీ ఎంపీలూ, కేంద్రమంత్రి వర్గంలోని టీడీపీ నేతలు కూడా భాజపాపై విమర్శలకు దిగాల్సిన సందర్భం వచ్చింది. అలాంటి సమయంలో వైకాపా మద్దతు ఏదీ..? ప్రతిపక్ష బాధ్యత ఏదీ..? ఈ సమయంలో ‘సుజనా చౌదరి మాట్లాడకూడదూ, ఆర్టికల్ సో అండ్ సో ప్రకారం క్యాబినెట్ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే రాజీనామా చేయాలీ’ అంటూ లా పాయింట్లు తీసి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడాన్ని ఏమనుకోవాలి..? అంతకుముందు, పోలవరం విషయంలోనూ ఇదే ధోరణి. టెండర్ల విషయమై కేంద్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తే… ఆ సమయంలో వేరే రకంగా ఫిర్యాదులు చేశారు. పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి చంద్రబాబును తప్పించేయండీ అని కోరారు. అమరావతికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటే… కమిషన్ల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఇలా ఒకటనేంటీ… అధికార పార్టీ చేసే ప్రతీ పనిలోనూ లేని అవినీతి కోణాన్ని వెతకడం, లేదా ప్రతి పని వెనకా ఎవరివో వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయేమో అనే అనుమానంతో చూడ్డం..! వైకాపా ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చింది ఇదే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోణాన్ని విస్మరిస్తూ వచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు అమ్ముకున్నారని గాట్టిగా విమర్శిస్తున్నప్పుడు… ఆ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష చేసిన ప్రయత్నం కూడా అంతే బలంగా జగన్ చెప్పాలి కదా! ‘నోరు తెరిస్తే అబద్ధం.., నాలుగేళ్లుగా పచ్చిమోసం.., రాజకీయాలు చేస్తే బాధేస్తోందీ.., రాజీనామా చేసి ఇంటికెళ్లిపోవాలీ.., విశ్వసనీయత లేదూ.. సినిమాల్లో హీరో గెలుస్తాడు’… ఇలాంటి పడికట్టు పదాలతోనే చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతూ పాదయాత్ర వెళ్లదీస్తున్నారు. అంతేతప్ప, ప్రతిపక్ష పార్టీగా తాము గడచిన నాలుగేళ్లుగా చేసిందేంటీ అనేది జగన్ చెప్పడం లేదే..!