జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపులతోపాటు, ఇంతవరకూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చామంటున్న నిధులకు సంబంధించిన అంశాలపై ఈ ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారు. అనంతరం మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆంధ్రాకు సంబంధించి కేంద్రంలో భాజపా సర్కారు, రాష్ట్రంలోని టీడీపీ సర్కారు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నాయని అన్నారు. ఈ లెక్కల విషయంలో ప్రజలందరికీ గందరగోళం ఉన్నట్టుగానే, తనకూ ఉందని పవన్ అన్నారు. టీడీపీ భాజపాలు ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతైతే నిధులు ఇచ్చిందని అంటున్నారో… ఆ లెక్కలు దయచేసి తనకు ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినవాటి వివరాలను కూడా ఇవ్వాల్సిందిగా రాష్ట్ర నేతల్ని కోరారు. ఈ రెండు లెక్కల్నీ తాను కమిటీకి పంపిస్తాననీ, కొంతమంది మేధావులూ ఆర్థిక రంగ నిపుణులతో ఏర్పాటు కానున్న వాస్తవాల నిర్ధారణ కమిటీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పవన్ చెప్పారు. ఈ వివరాలను ఆ కమిటీకి పంపితే అసలు లెక్కలు తేలుతాయన్నారు. ఒకరు కచ్చితంగా అబద్ధం ఆడుతున్నారనీ, ఇద్దరూ రైట్ అయితే అసలు ఈ గొడవ ఉండదనీ, ఇద్దరూ తప్పు అయినా కూడా ఈ గొడవ ఉండదనీ, కానీ.. ఒకరికి కచ్చితంగా తప్పుందని పవన్ అన్నారు. తాను కోరుతున్నట్టుగా 2014 నుంచి పద్దుల వివరాలను ఈ నెల 15లోగా ఇవ్వాలని కోరారు. ఆ తరువాత, ఉండవల్లి కూడా మాట్లాడారు. పవన్ తో జరిగిన భేటీలో ఎక్కడా రాజకీయాల ప్రస్థావన లేకపోవడం తనకు నచ్చిందన్నారు. అసలైన పాలిటిక్స్ ఇవాల్టి నుంచీ పవన్ ప్రారంభించారన్నారు. ఇన్నాళ్లూ పవన్ ప్రశ్నించడం ఒకెత్తూ, ఈ అంశంపై ప్రశ్నించబోతుండటం మరో ఎత్తు అన్నారు.
అంటే.. ఇప్పుడు కేంద్రం లెక్కల్ని భాజపా నేతలు ఇస్తారు, రాష్ట్రం లెక్కల్ని టీడీపీ నేతలు ఇవ్వాలి! వీటిని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పడిగడుతుంది. ఎవరు దోషులో తేల్చుతుందన్నమాట! ఓవరాల్ గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ పెద్దన్న పాత్ర పోషించేందుకు ఈ కమిటీ సిద్ధమౌతోంది. అయితే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే… ఈ కమిటీని కేంద్రంగానీ, రాష్ట్రంగానీ సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉంటుందా..? సరే, ఇక్కడ ప్రజల కోణంలో ఆలోచించి, ఇవ్వాల్సిన అవసరమే ఉందనుకున్నా.. సమాచారం వెబ్ సైట్లలో ఉంది చూసుకోండని అంటారేమో. ఇక, లెక్కలు విషయానికొస్తే… తేలాల్సినవి స్పష్టంగానే ఉన్నాయి కదా! పవన్ చెబుతున్నంత గందరగోళమైతే లేదు. ఆంధ్రాకి కేంద్ర కేటాయింపులతోనే ఇప్పుడు సమస్య, అంతేగానీ లెక్కలతో కాదు కదా.
ఉదాహరణకు కేంద్రం ఒక ప్రాజెక్టుకు రూ. వంద కోట్లు నిధులు మంజూరు చేసిందనుకుందాం. వారి లెక్కల్లో ఆ అమౌంట్ ఇచ్చినట్టుగానే చెప్పుకుంటారు. కానీ, నిధుల విడుదల విషయంలో అంత మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేయ్యరు కదా! దశలవారీగా విడుదల చేస్తారు. ఆ దశలవారీ కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నదే ఆంధ్రా సర్కారు వాదన. కేటాయింపులు పెంచాలనే కదా టీడీపీ సర్కారు పోరాటం చేస్తున్నది. దీంతో కేంద్రంలో కొంత స్పందన కనిపిస్తోంది. త్వరలోనే అన్నీ ఇస్తామని భరోసా ఇచ్చింది. అది కూడా సోమవారం నుంచే మొదలు అంటూ కేంద్ర పెద్దలు అంటున్నారు. సో.. లెక్కల్లో గందరగోళం ఎక్కడుంది..? కేంద్రం ఏపీకి చాలానే కేటాయించింది.. కానీ, నిధుల విడుదలలో ఆలస్యమౌతోంది. మరి, ఈ కమిటీ కొత్తగా తేల్చే లెక్కలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే.