సినిమా పరిశ్రమ అంటేనే అంత. రాత్రికి రాత్రే.. సీన్ రివర్స్ అవుతుంటుంది. సంక్రాంతి సినిమాల్లో నిలిచి, గెలిచిన సినిమా.. ‘జై సింహా’. నాలుగు డబ్బులు వెనకేసుకున్న సినిమా అదే. అయితే… ఆ సంతృప్తి నిర్మాత సి.కల్యాణ్‌కి ఎన్నో రోజులు లేకుండా పోయింది. వరుస ఫ్లాపుల తరవాత జై సింహా హిట్టుతో కాస్త తెరిపిన పడ్డాడు సి.కల్యాణ్. ఇంతలోనే.. దానికి రెండు రెట్లు సొమ్ముని ‘ఇంటిలిజెంట్’తో పోగొట్టుకున్నాడు. వినాయక్ ఈ సినిమాకి ప్యాకేజీ ప్రాతిపదికన పూర్తి చేశాడు. రూ.28 కోట్లకు సినిమా తీసి ఇస్తానన్నది వినాయక్ మాట. అన్నట్టుగానే అంతే బడ్జెట్లో సినిమా పూర్తి చేశాడు. పబ్లిసిటీకి రూ.2 కోట్లు వేసుకున్నా… రూ.30 కోట్ల బడ్జెట్ అయ్యింది. శాటిలైట్, మిగిలిన హక్కులరూపంలో రూ.6 కోట్ల వరకూ వచ్చింది. బాక్సాఫీసు రిటర్న్ మాత్రం దారుణంగా ఉన్నాయి. మొత్తం చూసినా రూ.4 నుంచి 5 కోట్లు కూడా రాని పరిస్థితి. ఎలా చూసినా దాదాపుగా రూ.18 కోట్ల వరకూ నష్టం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వినాయక్ సినిమా అంటే బీ, సీల్లో బాగా చూస్తారు. కానీ ఈ సినిమాకి అదీ లేదు. సాయిధరమ్ తేజ్ కే, కాదు టోటల్‌గా వినాయక్ కెరీర్లోనే ఇది భారీ ఫ్లాప్. ‘ఈ సినిమాతో కల్యాణ్ అన్న రుణం తీర్చుకుంటున్నా’ అని ఇది వరకు చాలా సార్లు చెప్పాడు వినాయక్. రుణం తీర్చుకోవడం మాట అటుంచితే… కల్యాణ్‌ని ఈ విధంగా అప్పుల పాలు చేయాల్సివచ్చింది.