నెల్లూరు జిల్లా పెద్ద కొండూరులో పార్టీ నేతలతో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష చేశారు. దీంతోపాటు కేంద్ర కేటాయింపులు, ప్రత్యేక హోదా పోరాటంపై కార్యాచరణ ప్రకటించారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు.. ప్యాకేజీతో మోసపోవద్దు’ అనే నినాదంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టేందుకు వైకాపా సిద్ధమౌతోంది. ఇదే నినాదంలో ఢిల్లీలో కూడా మార్చి 5న ధర్నా చేయనున్నట్టుగా పార్టీ నేతలు తెలిపారు. ఇదే అంశమై పార్టీ నేతలతో జగన్ మరోసారి సమావేశం అవుతారు. ప్రత్యేక హోదాను సమాధి చేసేందుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోందనీ, అందుకే ఈ పోరాటానికి వైకాపా సిద్ధమౌతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఏపీ ప్రతిపక్ష పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకున్న కీలక నిర్ణయం ఇది..!
కేంద్ర బడ్జెట్, అందులో ఏపీకి కేటాయింపులు, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా వైకాపా చాలా వెనకబడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు! కేంద్రంపై మిత్రపక్షమైన టీడీపీ ఆగ్రహంగా ఉంది. చివరికి జనసేన కూడా నిజ నిర్ధారణ కమిటీ అంటూ వారి స్థాయిలో వారి ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి, వీరందరికంటే ముందుగానే ప్రతిపక్షం వైకాపా స్పందించాలి. ఇక్కడే జగన్ వ్యూహాత్మక లోపం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఇప్పుడు కూడా వైకాపా ధోరణి ఎలా ఉందంటే… వారి పోరాటం కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన మాత్రమే అన్నట్టుగా ఉంది..! ఇప్పుడు కూడా వారు చెబుతున్నదేంటీ… ‘ప్రత్యేక హోదాను చంద్రబాబు సమాధి చేస్తున్నారు కాబట్టి, వైకాపా స్పందించాల్సి వచ్చింద’ని, కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందనే!
మొదట్నుంచీ జగన్ పోరాటం తెచ్చేవాళ్ల మీదే, ఇచ్చేవాళ్లను ఇప్పటికీ టార్గెట్ చేసుకోకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం! కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకి కేటాయింపులు సరిగా లేవన్నదే కదా ఇప్పటి టాపిక్. కానీ, ఆ ఊసే వారి ప్రకటనలో లేదు. ఇంకా ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అనే అంటున్నారు. హోదాకు సమానంగా నిధులూ రాయితీలూ ఇస్తామని కేంద్రం ఎప్పుడో ఒప్పుకుంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా అనేది ఇకపై ఉండదని కూడా కేంద్రమే గతంలో స్పష్టం చేసింది. అయినాసరే, ఇంకా హోదా తెస్తాం.. చంద్రబాబు తేలేకపోయారు.. తాకట్టు పెట్టేశారు.. ఇవే అంశాలతో వైకాపా కార్యాచరణకు దిగడాన్ని ఏమనుకోవాలి..?
అప్పుడెప్పుడో ‘ప్రత్యేక హోదా’పై పోరాటం ప్రారంభించిన కొత్తలో.. మా ఎంపీలు రాజీనామాలు చేసేస్తారు అని జగన్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీగా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుందని ప్రజలు అనుకునేలోగా.. తూచ్, మేము రాజీనామాలు చేస్తే పార్లమెంటులో మాట్లాడేవారు ఎవరుంటారు అంటూ యూ టర్న్ తీసుకున్నారు. కనీసం ఇప్పుడైనా ఆ నిర్ణయం ఉంటుందని అనుకుంటే.. దాని ఊసే లేదు. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోతే.. చివరి అస్త్రంగా రాజీనామాలు ఉంటాయని ఇంకా చెబుతున్నారు! ప్రత్యేక హోదాపై యువభేరి కార్యక్రమాలు, ఆమరణ దీక్షలు, త్వరలో చేపట్టబోతున్న నిరసన కార్యక్రమాలు.. ఏవి తీసుకున్నా సూటిగా కేంద్రంపై వైకాపా పెంచిన ఒత్తిడి అంటూ ఏదీ కనిపించడం లేదు. ఎంతసేపూ చంద్రబాబు అడగలేకపోయారూ, తీసుకుని రాలేకపోయారూ.. ఇలాంటి అంశాల చుట్టూనే జగన్ పోరాటం ఉంటోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిలదీసి స్థాయిలో, అంతే ధీటుగా తమ వాణీ ఇదీ అంటూ భాజపాని వైకాపా నిలదీసే పరిస్థితిని ఆశించడం అత్యాశ కదా.