ప్రత్యేక హోదాపై ఆఖరి అస్త్ర ప్రయోగం ఉంటుందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఆ పార్టీ ఎంపీలది కూడా అదే మాట. ఈ మధ్య బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు ముందు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇదే అంశమై మాట్లాడుతూ… తమ అధ్యక్షుడు ఆదేశించిన వెంటనే రాజీనామా చేస్తామన్నారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా.. అలా ఇస్తారంటే ఇప్పుడే చేస్తామని కూడా ప్రకటించారు. నిన్న నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలతో జగన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ ఎంపీల రాజీనామాకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ, విషయాన్ని వైకాపా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకూ అంటే… ఎంపీల రాజీనామా విషయమై ఆ పార్టీలోనే కొంతమంది నేతలు భిన్నాభిప్రాయాలతో ఉన్నారట! వారి మధ్యే ఏకాభిప్రాయం లేదని సమాచారం.
‘జగన్మోహన్ రెడ్డి చాలా చెప్తాడయ్యా, రాజీనామా అనగానే అయిపోతుందా ఏంటీ’… ఇదీ వైకాపాకి చెందిన ఓ ఎంపీ ఆఫ్ ద రికార్డ్ విలేకరులతో చెప్పినమాట! ‘మేము ఎప్పుడో చేసుండాల్సింది, ఇప్పుడు జగన్ చేయమని చెప్పినా ఏం లాభం? వేరే టాపిక్ మాట్లాడుకుందాం’.. ఇది కూడా మరోనేత ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయమే..! ప్రత్యేక హోదా కోసం రాజీనామా అంశమై మేకపాటి రాజమోహన్ తోపాటు మరో ఇద్దరి ముగ్గురు కీలక నేతలు అభిప్రాయాలు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది. సో… రాజీనామాలకు సంబంధించి పార్టీ అధినేతగా జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే.. ‘జీ హుజూర్’ అనేందుకు ఎంపీలంతా సిద్ధంగా లేరన్న అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ అభిప్రాయాలున్నాయి.
మరో ఆర్నెల్లు తరువాత ఎలాగూ ఎన్నికల మూడ్ వచ్చేస్తుందనీ, కాబట్టి ఇంకా ఈ రాజీనామా అంశాన్ని పట్టుకుని వేలాడటం అనవసరం అనేది కొందరి అభిప్రాయంగా తెలుస్తోంది! టీడీపీ, భాజపాలు కలిసి ఇప్పుడు వైకాపాను సైడ్ చేసే ప్రయత్నంలో ఉన్నాయనీ, ముందుగా దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందనే భావన కొంతమంది ఎంపీల్లో ఉంది. అయితే, ఇప్పటికైనా రాజీనామాలు చేసేస్తే కొంత ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలూ కొద్దిమంది వ్యక్తం చేస్తున్నారట. ఓవరాల్ గా ఒక విషయం చాలా స్పష్టం… ఎంపీల రాజీనామాపై వైకాపాలోనే ఏకాభిప్రాయం కుదిరే వాతావరణం కనిపించడం లేదు. జగన్ డిసైడ్ చేసినా దాన్ని వెంటనే ఫాలో అయిపోవడానికి నేతలు సిద్ధంగా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.