కొంతమంది కొన్ని ఫ్లాపుల నుంచి భలే తప్పించేసుకుంటుంటారు. అప్పటికప్పుడు తెలివిగా ఆలోచించి – ‘నో’ చెప్పేస్తారు. రవితేజ అదే చేశాడు. ఈయేడాది బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో వినాయక్ ‘ఇంటిలిజెంట్’ కూడా ఉంది. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్‌కి వరుసగా ఐదో ఫ్లాప్ తగిలింది. నిజానికి ఈ ఫ్లాప్… రవితేజ ఖాతాలో పడాల్సింది. ఎందుకంటే వినాయక్ ఈ కథని రవితేజ కోసమే డిజైన్ చేశాడు. రవితేజ – వినాయక్ కాంబినేషన్లో ‘కృష్ణ’ వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత… వీరిద్దరూ పనిచేయలేదు. ‘ఇంటిలిజెంట్’ కూడా ‘కృష్ణ’ ఫార్మెట్లో సాగే సినిమానే. ‘ఇది కృష్ణలాంటి సినిమా’ అని వినాయక్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. రవితేజకు కథ వినిపిస్తే..’చేయను’ అని చెప్పకుండా తెలివిగా తప్పించుకున్నాడు. ”నా కమిట్మెంట్లు చాలా ఉన్నాయి.. అయినంత వరకూ ఆగుతారా” అని వినాయక్‌ని అడిగాడట రవితేజ. కానీ.. వినాయక్‌కి ఎదురు చూసే టైమ్ లేకుండా పోయింది. ఎందుకంటే ‘ఖైది నెం.150’ తరవాత రావాల్సిన గ్యాప్ కంటే వినాయక్ కి ఎక్కువ గ్యాపే వచ్చింది. రవితేజ కోసం ఆగితే… ఇంకా లేటయిపోతుందని భావించిన వినాయక్… ఈ సినిమా కోసం సాయిధరమ్ తేజ్‌ని రంగంలోకి దింపాడు. అలా.. ఓ ఫ్లాప్‌ని తన తెలివితేటలతో తప్పించుకున్నాడు రవితేజ.