ఫ్లాప్ నెం.5 కూడా సాయిధరమ్ తేజ్ ఖాతాలో పడిపోయింది. ఈమధ్యకాలంలో వరుసగా ఇన్ని ఫ్లాపులు కొట్టిన హీరో… తేజూనేనేమో. వీటిలో తన స్వీయ తప్పులూ ఉన్నాయి. కథల్ని సరిగా జడ్డ్ చేయకుండా, గుడ్దెద్దు చేలో పడినట్టు సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అవి కాస్తా ఫ్లాప్ అవుతున్నాయ్. కృష్ణవంశీ, వినాయక్‌ల ట్రాక్ రికార్డ్ చూసి వాతలు పెట్టుకున్నాడు. దాంతో ఓ రెండు ఫ్లాపులు తన ఖాతాలో చేరాయి. తిక్క, జవాన్, విన్నర్ కూడా పక్కా మిస్ జడ్జ్మెంట్ల వల్ల వచ్చిన ఫ్లాపులే. దానికి తోడు చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను మాటి మాటికి ఇమిటేట్ చేసి, ఇరిటేట్ చేసేస్తున్నాడు. అంతేనా అంటే.. చిరంజీవి పాటల్ని తన ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నాడు. ఆ పాటల వల్ల సినిమాకి కలిసొచ్చే అదనపు ప్రయోజనం శూన్యం. పైపెచ్చు పాత సూపర్ హిట్ పాటల్ని ఖూనీ చేస్తున్నాడన్న అపవాదు మూటగట్టుకుంటున్నాడు తేజూ. తను మంచి టాలెంటెడే. కాకపోతే.. మెగా అభిమానుల్ని మరింతగా ఆకట్టుకోవాలన్న తాపత్రయంలో దొడ్డుదారుల్ని వెదుక్కుంటున్నాడు.
మరోవైపు వరుణ్‌తేజ్ చూడండి.. తెలివిగా మలుసుకుంటున్నాడు. తాను మెగా కుటుంబం నుంచి వచ్చిన వాడే. కానీ పవన్, చిరంజీవిల్ని ఇమిటేట్ చేయాలనీ ఒక్కసారి కూడా అనుకోలేదు. పైగా మాస్ ఇమేజ్ కోసం పాకులాడడం లేదు. రీమిక్స్ జోలికి అస్సలు వెళ్లలేదు. సాయిధరమ్ తేజ్ కూడా వరుణ్ని చూసి నేర్చుకోవాలి. తన తప్పుల్ని దిద్దుకోవాలి. తనకున్న క్రేజ్‌ని సవ్యమైన దారిలో వాడుకోవాలి. లేదంటే మెగా ఫ్యామిలీలోనే ఎక్కువ ఫ్లాపులు చవి చూసిన హీరోగా నిలబడిపోవాల్సివస్తుంది.