హాస్య నటులకున్న క్రేజ్ ఇంకెవ్వరికీ ఉండదేమో. కలసి రావాలే గానీ, ప్రతీ రోజూ షూటింగే. ఒక్క రోజుకి లక్షరూపాయలు సంపాదించొచ్చు. స్టార్ డమ్ వస్తే.. రెండు, మూడు లకారాలూ డిమాండ్ చేయొచ్చు. కొన్నాళ్లు కమెడియన్‌గా ఏలితే… డబ్బే డబ్బు. కాకపోతే… కామెడీ వేషాలు బాగా వస్తున్నప్పుడే హీరోయిజం కూడా చూపించేయాలన్నది కొంతమంది ఆత్రం. దాంతో అటు కామెడీ వేషాలూ రాక, ఇటు హీరోగానూ సక్సెస్ కాలేక డీలా పడతారు. అందుకు సప్తగిరి తాజా ఉదాహరణ. హీరోగా తన నుంచి రెండు సినిమాలొచ్చాయి. రెండూ ఫ్లాపే. ఈ పరాజయాలు కమెడియన్‌గా తన కెరీర్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపించాయి.
సప్తగిరి కంటే కమెడియన్ లిస్టులో కిందుండే షకలక శంకర్ ఇప్పుడు హీరోగా మారాడు. శంభో శంకర సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు షకలక. సప్తగిరిలా డాన్సులు చేసి, ఊర మాసు డైలాగులు చెప్పి.. షాక్ ఇద్దామని తానూ ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌లో శంకర్‌ని చూస్తుంటే సప్తగిరే గుర్తొస్తున్నాడు. కమిడియన్ హీరోగా అయినంత మాత్రాన కామెడీ వదిలేయాలన్న రూలు లేదు. కామెడీ అందివ్వాల్సిందే. ఆ మాటకొస్తే అందుకోసమే జనాలు థియేటర్లకు వస్తారు. దాన్ని మర్చిపోయి నేలవిడిచి సాము చేస్తుంటారు మన కమెడియన్లు. సప్తగిరి అలా చేసినవాడే. పరిస్థితి చూస్తుంటే శంకర్ కూడా అదే తప్పు రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.