ఆంధ్రాకి కేంద్రం చేసిన సాయంపై భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు! ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ ఎందుకు మాట్లాడతారనీ… ఏ రూపంలో వచ్చిన అది రాష్ట్ర అభివృద్ధికి సాయమని అన్నారు. విభజన చట్టంలోని అంశాలు ఐదేళ్లలో అమలు చేయాలని ఎక్కడా లేదనీ, ఈ విషయమై కాంగ్రెస్ ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వీర్రాజు చెప్పారు. 2013లో ఈ బిల్లు పెట్టారు కాబట్టి… పదేళ్ల వరకూ, అంటే 2022 వరకూ ఈ అంశాలను అమలు జరపొచ్చన్నారు. విద్యా సంస్థల విషయమే తీసుకుంటే… నూటికి నూరు శాతం కేంద్రం ఇచ్చేసిందన్నారు. అడిగినదానికంటే అదనంగా మరో 8 యూనివర్శిటీలు ఇచ్చారనీ, మొత్తంగా 16 ఇచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రాన్ని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. వీటి నిధుల కేటాయింపుల విషయమై వచ్చేసరికి… వీర్రాజు అభిప్రాయం మరోలా మారడాన్ని గమనించొచ్చు! ఇవన్నీ కేంద్రం అధీనంలో నడిచే సంస్థలనీ, అన్నీ వాళ్లే చూసుకుంటారనీ, కాబట్టి వీటికి నిధులు తక్కువ ఇచ్చారూ ఎక్కువ ఇచ్చారనేది వారే చూసుకుంటారని తేల్చేశారు.
రాజధాని గురించి మాట్లాడుతూ… రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఈ నాలుగు కట్టాలని మాత్రమే బిల్లులో ఉన్నాయన్నారు. వీటికోసం ఇప్పటివరకూ కేంద్రం రూ. 1500 కోట్లు, మరో రూ. 1000 వెంకయ్య నాయడు ఇచ్చారన్నారు! ‘అమరావతి కోసం తాము ఇచ్చింది చాలా ఎక్కువే’ అని చెప్పడం కోసం కేసీఆర్ ను ఉటంకిస్తూ ఓ అస్పష్టమైన పోలిక తీసుకొచ్చారు. ఈ మధ్య ఏదో గ్రౌండ్ లో హైదరాబాద్ లో ఏదో కేసీఆర్ కడుతున్నారనీ, దాని ఖర్చు బహుశా రూ. 200 లేదా 300 కోట్లు అవుతుందని వీర్రాజు చెప్పారు. అంటే, మిగతా లెక్కలు మనం వేసుకోవాలన్నమాట! ఇక, రెవెన్యూ లోటు గురించి మాట్లాడుతూ… రూ. 16 వేల కోట్లు ఇవ్వాలంటూ గవర్నర్ ఇచ్చింది ఓ ప్రొజెక్షన్ మాత్రమే అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక కమిటీని వేసి లెక్కలు కడితే తేలిన లోటు రూ. 4,600 కోట్లు అని వీర్రాజు చెప్పారు. అంతేకాదు, ఈ లోటు కింద ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన నిధులు సుమారు రూ. 4 వేల కోట్లు అని చెప్పారు. అంటే, రెవెన్యూ లోటు తీర్చేసినట్టే..! అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలు, వారికున్న ఆర్థిక ఇబ్బందుల్ని కూడా కలిపేసి రూ. 1600 కోట్లతోనే కేంద్రంతో ఏపీ డీల్ చేస్తోందన్నారు. అంటే, వాస్తవ రెవెన్యూ లోటును భాజపా తీర్చేసిందని వీర్రాజు చెబుతున్నట్టు అర్థం చేసుకోవాలి.
ప్రత్యేక హోదా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు మాత్రమే అని నిర్వచించారు! ఇక్కడే ఆంధ్రా సర్కారును వీర్రాజు ప్రశ్నించారు. ‘కేంద్రం నుంచి వస్తున్న ఈ నిధులను అన్ని ప్రాంతాల అభివృద్ధికి సరిగా ఖర్చు చేసేందుకు మీ దగ్గర సరైన ప్రణాళిక ఉందా’ అని అడిగారు. ఈ ప్రశ్న గతంలో ఎప్పుడైనా వీర్రాజు ఎందుకు వేయలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వేరే చర్చ. రైల్వే జోన్ గురించి కూడా కొత్త లాజిక్ తో మాట్లాడారు. దేశంలో ఎనిమిది జోన్లు మాత్రమే ఉన్నాయనీ, గతంలో విడిపోయిన ఛత్తిస్ గడ్ లో లేదు, ఉత్తరాంచల్ లో లేదు, జార్ఖండ్ లో లేదు అని చెప్పారు. కేవలం పరిశీలన చేయాలని మాత్రమే ఇక్కడ ఉందన్నారు. అయినప్పటికీ, దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో కేంద్రం ఉందన్నారు. ఇక, దుగరాజుపట్నం పోర్టు గురించి మాట్లాడుతూ… ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాల్సిన అంశమన్నారు! దీంతోపాటు పశ్చిమ బెంగాల్ పోర్టు వారి హయాంలోనే మంజూరు చేసి పూర్తి చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. అప్పుడువారు నిర్ణయించి ఇప్పటివరకూ కట్టలేదన్నారు. సో.. ఇది ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వివాదం కాదని సోము వీర్రాజు స్పష్టత ఇవ్వడం జరిగింది! అయితే, కేంద్రం ఇప్పుడు కట్టేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
బిల్లులో ఉన్నవి ఇవేనని వీర్రాజు అన్నారు! ఇవన్నీ పూర్తి చేయడానికి పదేళ్లు సమయం ఉన్నప్పటికీ… ఈ అంశాలపై కాంగ్రెస్ ను విమర్శించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మనం వేరే విషయాలు మాట్లాడుతున్నాం అని వీర్రాజు అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఇది ఒక అద్భుతమైన బడ్జెట్ అని మరోసారి మెచ్చుకున్నారు. పోలవరం గురించి కూడా మాట్లాడుతూ… దాన్ని ఐదేళ్లలోగానీ, పదేళ్లలోగానీ కట్టాలనే టైమ్ ఏదీ లేదన్నారు! కాంగ్రెస్ హయాంలో జరిగిన పని చాలా తక్కువనీ… 2016లోనే కేంద్రం పనులు ప్రారంభిస్తే, ఇప్పటికే చాలా పనులు జరిగిపోయాయంటే ఒక్కసారి ఆలోచించాలన్నారు. మొత్తంగా… ఆంధ్రాకు కేంద్రం చేసిన సాయాన్ని సోము వీర్రాజు ఈ విధంగా, భాజపాకు అత్యంత అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అని నిరూపించే విధంగా, అన్నిటికీ మించి ఆయన ఒక భాజపా నేతగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు