మామూలుగానే వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కాస్త నోటి దూల ఎక్కువ. టీడీపీ వాళ్లను తిట్టే సమయంలో అది మరింత ఎక్కువవుతుంది. అది హద్దులు దాటిపోయి తాను ఎమ్మెల్యే అన్న సంగతి కూడా మరచిపోతారామె. అందుకే జగన్ కూడా టీడీపీ వాళ్లను తిట్టాల్సి వచ్చినపుడు రోజానే రంగంలోకి దింపుతారు. సాక్షాత్తూ ఓ బహిరంగ సభలోనే చంద్రబాబును బాగా తిట్టాలంటూ అప్పట్లో రోజాకు జగన్ చెప్పిన విషయాన్ని ఎవరూ అంత తొందరగా మరచిపోరు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మంత్రి లోకేష్‌లపై ఆమె చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు.. అందులోనూ గల్లా జయదేవ్ పార్లమెంట్లో తీవ్ర నిరసన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. జయదేవ్ అయితే మోదీ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ఇస్తారా చస్తారా అన్న స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమ డిమాండ్లపై గట్టిగా నిలబడ్డారు. కానీ ఇవేవీ రోజాకు కనిపించినట్లు లేదు. ఏం సాధించారని ఓ గుండుకు సన్మానాలు చేస్తున్నారంటూ గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న బోడె ప్రసాద్ గుండు కొట్టించుకుంటే.. మరో గుండాయన సన్మానాలు చేయించుకుంటున్నారు అని రోజా అన్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపైనా ఆమె విరుచుకుపడ్డారు. టాయిలెట్లు సరిగ్గా లేకపోతేనే కలెక్టర్లపై పోరాటం చేస్తానన్న బాబు.. హోదా ఇవ్వని కేంద్రంపై ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక హోదాను జగన్‌తో, ప్యాకేజీని లోకేష్‌తో పోలుస్తూ రోజా చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా జగన్లాంటిదైతే.. ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో ఉండే ఎందుకూ పనికిరాని పప్పులాంటిదని ఆమె చిల్లర కామెంట్స్ చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్.. అమెరికాలో పార్టీని అభివృద్ధి చేస్తాననడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆమె అన్నారు. పెట్టబడుల కోసం చంద్రబాబు దేశవిదేశాలు తిరుగుతుంటే.. దానినీ తప్పుబట్టేలా రోజా వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ కేంద్రం నుంచి నిధులు రాకుండా చేశారట. ఈ కామెంట్స్ మరీ నవ్వు తెప్పించేలా ఉన్నాయి. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, నటనలో ఎన్టీఆర్‌నే మించిపోయారని రోజా అన్నారు.