నాని నిర్మాతగా మారి తీసిన సినిమా ‘అ’. పోస్టరుపై కాజల్, నిత్యమీనన్, రెజీనా.. ఇలా చాలామందే కనిపిస్తున్నారు. దాదాపుగా అందరివీ గెస్ట్ రోల్సే. కాబట్టి… వీళ్లెవ్వరికీ నాని పారితోషికాలు ఇచ్చి ఉండడని, అందరూ… నానిపై గౌరవంతో ఈ సినిమా ఒప్పుకుని ఉంటారని, ఆ విధంగా నాని బడ్జెట్‌ని తగ్గించుకున్నాడని.. బోలెడన్ని వార్తలు, కబుర్లు వినిపించాయి. అయితే… ఇందులో నిజం ఏమిటంటే…. వాళ్లందరూ తమ పారితోషికాల్ని అందుకున్నవారే. ఎవ్వరూ రిబేట్లు, ప్రత్యేక డిసౌంట్లు ఇవేం ఇవ్వలేదు. ఈ విషయాన్ని నానినే చెప్పాడు. ”ఓ నిర్మాతగా నేను, నటీనటులుగా వాళ్లూ ఆలోచించుకున్నాం. సాధారణంగా వాళ్లు ఓ సినిమాకి ఓ సినిమా కోసం నలభై, యాభై కాల్షీట్లు ఇస్తారు. దాన్ని బట్టి వాళ్లకు పారితోషికం ఉంటుంది. నాకన్ని కాల్సీట్లు అవసరం లేదు. నాకిచ్చిన కాల్సీట్లకు ఎంత పారితోషికం ఇవ్వాలో, అంతా ఇచ్చాను. ఈ విషయంలో రిబేట్లేం లేవు” అని క్లారిటీ ఇచ్చేశాడు నాని. ఈ సినిమా పూర్తయ్యాక మరొకరికి అమ్మే అవకాశమూ వచ్చిందని, కాకపోతే ఆ రిస్కు కూడా తానే తీసుకోవాలన్న ఉద్దేశంతో సొంతంగా విడుదల చేయాల్సివచ్చిందని చెప్పుకొచ్చాడు నాని.