“ఎవరి పని వాళ్ళు చేయాలి… ఎవరి పని వాళ్ళచేత చేయించాలి” – శుక్రవారం మధ్యాహ్నం రచయిత సాయిమాధవ్ బుర్రా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్! సందీప్ కిషన్ హీరోగా మహేశ్‌బాబు సిస్టర్ మంజుల డైరెక్ట్ చేసిన ‘మనసుకు నచ్చింది’ చిత్ర ఫలితాన్ని, చిత్రబృందంలో కీలక వ్యక్తులను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారని టాక్. చిత్రబృందంలోని కీలక వ్యక్తి ప్రవర్తనతో సాయిమాధవ్ బుర్రా మనసు నొచ్చుకుందని, చిత్రం ఆయనకు నచ్చలేదని సమాచారమ్. క్రిష్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు, ఇతరుల చిత్రాలకు సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. చిరంజీవి రీఎంట్రీ ఫిల్మ్ ‘ఖైదీ నంబర్ 150’లో, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆయన రాసిన మాటలకు మంచి పేరు వచ్చింది. ‘మనసుకు నచ్చింది’ చిత్రానికి కూడా మాటలు రాసిందీయనే. రాశారు కానీ మనస్ఫూర్తిగా రాయలేదట! ఆయన పనిలో ఇతరులు జోక్యం చేసుకోవడంతో మంచిగా రావలసిన సన్నివేశాలు కాస్తా సినిమాను ముంచేవిధంగా తయ్యారయ్యాయని టాక్.
రచయితగా సాయిమాధవ్ బుర్రాకు ప్రేక్షకుల్లో మంచి పేరు వుంది. అందుకే ఆయనతో పని చేసిన దర్శక నిర్మాతలు సినిమా విడుదలకు ముందు ఆయన చేత ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తారు. ‘మనసుకు నచ్చింది’ విషయానికి వస్తే పబ్లిసిటీ కార్యక్రమాల్లో, సినిమా ఫంక్షన్లలో ఈయన ఎక్కడా కనిపించలేదు. చిత్రబృందంతో ఏర్పడిన మనస్పర్థలే అందుకు కారణమట! పైగా, మంజుల ఘట్టమనేని ప్రతిచోటా ‘నేను ఇంగ్లీష్ లో డైలాగులు రాసుకుంటే ఆ భావాన్ని తెలుగులో తర్జుమా చేసేవిధంగా సాయిమాధవ్ బుర్రా గారు డైలాగులు రాశారు’ అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ సాయిమాధవ్ మనసును నొప్పించాయట. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ‘ఎవరో డిస్టర్బ్ చేసినట్టున్నారు’ అంటే… సాయిమాధవ్ బుర్రా అటువంటిది ఏం లేదంటున్నారు. అసలు తప్పు ఎవరు చేశారో?