తెలుగు360.కామ్ రేటింగ్ : 3.25/5
అన్ని సినిమాలు ఒకేలా వుండవు. అలా అని అన్ని సినిమాలకు ఒకే తరహాలో సమీక్షించడం కూడా కదురదు. అ అనే మూవీని ఓ ప్రత్యేకమైన సినిమాగా చూడాల్సిందే. అందులో తప్పులేదు. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో అది ఓ అబ్బురమే. కాల్ చేసే వాళ్లే కాదు, రిసీవ్ చేసుకునేవాళ్లు కూడా డబ్బులు చెల్లించాలంటే అమ్మో అనుకున్నవాళ్లే. ఇంకా ఎన్నో సందేహాలు. కానీ ఇవ్వాళ సెల్ ఫోన్ గలగలలు పొలాల్లో వరినాట్ల పాటల మద్య ఆడ కూలీల నడుంకు చుట్టుకున్న చీర మడతల్లోంచి వినిపిస్తున్నాయి.
అ..సినిమా కూడా అంతే. ఇప్పుడు ఇదేం సినిమా. అబ్సర్డ్ అని కొట్టి పడేయడం పెద్ద విషయం కాదు. కానీ అవుటాఫ్ ది బాక్స్ ఐడియా అని కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం వుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐడియా కొత్తది కాదు. పూర్వం మన నాటకాల్లో (నాటికలు కాదు) అంకానికో నటుడిని కృష్ణుడిగా చూపించేవారు. ఎందుకంటే అన్ని అంకాలు కలిసి ఒకే నటుడు చేయలేడు అని.
మామూలుగా సమీక్ష అంటే కచ్చితంగా కథ రాయాల్సిందే. అప్పుడే ఆ కథ ఎలా తెరకెక్కిందీ అన్నది వివరించడం రివాజు. కానీ అ సినిమాలో కథ కాదు ముఖ్యం. ఓ అమ్మాయి జీవితం వివిధ దశల్లో ఎలా వుంది? ఏయే దశల్లో ఆ అమ్మాయి ఎలా ప్రవర్తించింది. ఏం చేద్దాం అనుకుంది? ఆఖరికి ఏం చేసింది? అన్నదే ఈ సినిమాలో కథ. ఈ కథకు వున్న వివిధ అంకాల్లో పలువురు ఆ అమ్మాయిగా మనకు కనిపిస్తారు.
నిజానికి ఇలా రాయడం ఆ సినిమాకు కాస్త ద్రోహం చేసినట్లే అవుతుంది. కానీ అ సినిమా అవుటాఫ్ ది బాక్స్ అయిడియాలోంచి పుట్టి వుండొచ్చు కానీ, సమీక్ష అదే దోవన వెళ్తే అంత బాగోదు. అ సినిమా నిజంగా కొందరు ‘టెక్నీషియన్ల’ సినిమా. దీని వెనుక దర్శకత్వశాఖలో, నటనలో అనుభవం పండిన నాని వున్నాడు. దర్శకుడిగా, కథకుడిగా పేరున్న అవసరాల శ్రీనివాస్ వున్నారు. త్వరలో దర్శకత్వం చేయబోతున్న సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని వున్నారు. ఆర్ట్ డైరక్షన్ అంటే సెట్ లో ఏవి ఎక్కడ వుండాలో అన్నది మాత్రమే కాదు, కొత్తదనం ఏ వైపు నుంచి ఎలా తీసుకురావాలో తెలిసిన ఆర్ట్ డైరక్టర్ సురేష్ వున్నారు. వీళ్లందరిని ఓ దగ్గరకు చేర్చగలిగిన కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ వున్నారు. అందుకే ఈ ప్రొడెక్ట్ ఇంత బాగా వచ్చింది. అయితే ఇలా వచ్చిన సరుకు అందరికీ నచ్చుతుందా? నచ్చదా? అన్న చచ్చు ప్రశ్న అనవసరం. ఎందుకంటే ఇప్పుడు కొందరికే నచ్చవచ్చు. భవిష్యత్ లో ఇలాంటి కొత్త ఆలోచనలు మరిన్ని, ఇదే సినిమా స్ఫూర్తిగా వచ్చి చాలా మందికి నచ్చడం మొదలుకావచ్చు.
అయితే అలా అని కొత్త దర్శకుడు అస్సలు తప్పులు చేయలేదు అని అనడానికి లేదు. మెయిన్ పాయింట్ ను, ఆ పాయింట్ ను వివిధ పాత్రల ద్వారా చెప్పే వైవిధ్యమైన అయిడియాను చివరి వరకు దాచి పెట్టడాని కోసం, ఆలోచించండంలో ప్రేక్షకులకు కాస్త క్లారిటీ మిస్ చేసాడు. తొలిసగం వరకు ఓకె. పాత్రల పరిచయమే కాబట్టి, పాసైపోయింది. పైగా ఒక రెస్టారెంట్ అంటే కొత్త దనం తెచ్చిన ఆర్ట్ వర్క్, ప్రతి పాత్రను జెన్ నెక్ట్స్ అనే టైపులో తీర్చి దిద్దడం వల్ల కలిగిన ఆసక్తి. నిత్యానీనన్-ఈశా ఎపిసోడ్ కలిసి తొలిసగాన్ని నూటికి నూరు శాతం మార్కులతో పాస్ ఛేసాయి. అందులో సందేహం లేదు.
కానీ ద్వితీయార్థం దగ్గరే సమస్య. ఎందుకంటే పాయింట్ లో తొలిభాగం తొలిసగంలో చెప్పేసారు. మిగిలినది క్లయిమాక్స్ లో తప్ప చెప్పడానికి వీలు లేదు. మరి ఈ మథ్యలో ఏం చేయాలి. అందుకోసమే కథతో సంబంధం లేకుండా ప్రపంచంలో కృష్ణుడిని మించిన మాయావి (మెజీషియన్) ఎవరు అన్న పాయింట్ తో ఓ ట్రాక్ రన్ చేసారు. అది ఆరంభంలో బాగుంది కానీ, తరువాత బోర్ కొట్టింది. అదే విధంగా పాత్రలను అక్కడే, ఆ పాయింట్ దగ్గరే వంచి, అలా చూపించడం కూడా సాగదీసినట్లే అయింది. ఈ పాత్ర ను కూడా క్లయిమాక్స్ లో పార్ట్ చేయడం ఎందుకో అన్నదాంట్లో క్లారిటీ మిస్ అయింది కూడా.
కానీ దర్శకుడు ఏం చేయగలడు. అప్పటికి రెండు గంటల లోపే సినిమా ముగించాడు. ఇంకా తగ్గిస్తే షార్ట్ ఫిలిమ్ కు ఎక్కువ, మెయిన్ సినిమాకు తక్కువ అవుతుంది. అందుకే దర్శకుడు చేసిన పని కాస్త సాగదీత అనిపిస్తుంది. అసలే తొలిసగంలో చూపించీ చూపించకుండా, చెప్పీ చెప్పకుండా చేసిన తరువాత ఆసక్తితో మలి సగం చూడడానికి లోపలికి వచ్చిన వారికి ఈ సాగదీత వ్యవహారం కాస్త ఇబ్బందిగా వుంటుంది. దీన్ని ఓకె అనుకున్నా, క్లయిమాక్స్ విషయంలో దర్శకుడు మరి కాస్త శ్రద్ధ వహించాల్సింది. అప్పటి దాకా దాచింది మూట విప్పి చూపించే ముందు అంత ఆత్రం పనికిరాదు. పైగా చూపించేది సాదా సీదా వ్యవహారం కాదు. ప్రేక్షకుడికి కాస్త షాక్ ఇచ్చే వ్యవహారం అని తెలిసిన తరువాత, కాస్త నెమ్మదిగా, అర్థం అయ్యేలా, అవగతం చేసుకునేలా చెప్పి వుండాల్సింది. కానీ దీనివల్ల ఏమయింది..చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్…ఓస్ ఇదా..అని ఏనుగు సామెతలా అనుకునే ప్రమాదం వుంది.
అయినా, క్లయిమాక్స్ కాస్త నిరాశ పరచినా, నిర్మాత నాని, దర్శకుడు ప్రశాంత్, ఇతర టెక్నీషియన్ల కష్టాన్ని ఇట్లే తోసిపారేయడానికి వీలు లేదు. ఇలా ఆలోచించి, ఇలా చూపించడానికి ట్రయ్ చేద్దాం. యూ ట్యూబ్ ద్వారా ప్రపంచపు సినిమాకు దగ్గరవుతున్న ప్రేక్షకులకు మనం కూడా అలాంటి సినిమాను చూపించే ప్రయత్నం చేద్దాం. అవి అర్థం చేసుకున్నవాళ్లు, ఇది మాత్రం అర్థం చేసుకోరా? అని అలోచన చేసినందుకైనా మెచ్చుకోవాలి.
ఇలాంటి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ శహభాష్ అనుకునేలా చేసారు. అందులో అణుమాత్రం అనుమానం లేదు. టెక్నికల్ వాల్యూస్ పెర్ ఫెక్ట్ గా వుండడం కాదు, ఓ మెట్టుపైనే వున్నాయి.
ఫైనల్ జడ్జిమెంట్
తెలుగు సినిమాకు యువరక్తం ఎక్కుతోంది. కొత్త జవసత్వాలు వస్తున్నాయి. అలాంటపుడు కాస్త తప్పటడగులు వుంటాయి. కానీ అడుగు ముందుకే కాబట్టి, ప్రోత్సహించడం అవసరం.
ఫైనల్ పంఛ్
ముందు ‘అ’డుగు
తెలుగు360.కామ్ రేటింగ్ : 3.25/5