తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్… హీరో సాయిధరమ్ తేజ్ పంచ ఫ్లాపుల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన నక్షత్రం మినహాయిస్తే మిగతా నాలుగు సినిమాలకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. తేజూ మంచి ఫ్రెండ్ కావడంతో ఆయా సినిమాలపై స్పెషల్ కేర్ తీసుకునేవాడు. కానీ, ఏం లాభం? ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. సెంటిమెంట్ ప్రకారం తమన్‌తో సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తే హిట్ కాదు. ఈ సంగతి స్వయంగా హీరోగారే చెప్పారు. “నేను, తమన్ కలిసి సినిమా చేస్తే అందులో పాటలు హిట్ అవుతున్నాయి. కానీ, సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది. ‘ఇంటిలిజెంట్’ మాత్రం అలా కాకూడదని కోరుకుంటున్నా” అని విడుదలకు ముందు ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఆయన కోరికను భగవంతుడు మన్నించలేదు. ‘ఇంటిలిజెంట్’ని కూడా ప్లాప్ చేశాడు. దాంతో సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాకు తమన్‌ని తప్పించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించే సినిమాకు యువ సంగీత సంచలనం సంగీతం అందిస్తాడని నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్ రవిచంద్రన్, మరో ఇద్దరు సంగీత దర్శకులను ఆప్షన్‌గా అనుకుంటున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాతో పాటు తమన్ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అయినా సాయిధరమ్ తేజ్ అడిగితే కాదని అనడు. పైగా, దర్శకుడు గోపీచంద్ మలినేని తీసిన ఐదు సినిమాల్లో మొదటి సినిమా ‘డాన్ శీను’ మినహాయిస్తే మిగతా నాలుగు సినిమాలకు తమన్ సంగీత దర్శకుడు. దీన్నిబట్టి దర్శకుడితో తమన్‌కి ఎంత ర్యాపో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ, సినిమా టీమ్‌లో ఎవరూ రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదట. అందుకే కొత్త సంగీత దర్శకుడివైపు చూస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. సెంటిమెంట్‌తో సహా! నమ్మకాలకు ఎక్కువ విలువ ఇచ్చే సినిమా ఇండస్ట్రీలో మరీ పట్టింపులు ఎక్కువ వుంటాయి. స్నేహితుడు స్నేహితుడే. సినిమా సినిమాయే.