తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్‌ను తీసుకురావడానికి కృషి చేసిన ప్రముఖుల్లో మూవీ మొఘల్ రామానాయుడు ఒకరు. ప్రేక్షకుల మనసుల్లో చిరస్ధాయిగా నిలిచిన ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఎందరో నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇచ్చి వెన్ను తట్టి ప్రోత్సహించారు. తుది శ్వాస వరకూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. రూపాయి నోటు మీదున్న భారతీయ భాషలు అన్నిటిలోనూ చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది.
ఒకప్పుడు రాళ్లూరప్పలతో నిండిన హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నేడు గొప్పగా ఉందంటే ఆయన కూడా ఒక కారణం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవలసిన ఆయన విగ్రహాన్ని ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో పెట్టడానికి కృషి చేస్తున్నట్టు జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 18న రామానాయుడు వర్ధంతి సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని రామానాయుడు కళామండపంలో మూడు రోజులు నాటకోత్సవాలు నిర్వహించారు. 16న మొదలైన ఉత్సవాలు 18న ముగిశాయి. ముగింపు ఉత్సవాల్లో జూన్ లేదా జూలై నెలలో ఈ ఆవరణలో నాయుడుగారి విగ్రహం పెడతామని కాజా సూర్యనారాయణ చెప్పారు.