గతకొంత కాలంగా కిడ్నీ, మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న హాస్యనటుడు గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. 2010లో భార్య పైలోకాలకు వెళ్లారు. తర్వాత కుమార్తె మరణం ఆయన్ను మరింత కలచివేసింది. మెల్లగా సినిమా అవకాశాలు తగ్గుతూ రావడం, కుటుంబ సభ్యులు దూరమవడంతో గుండు హనుమంతురావు అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లిన కుమారుడు ఇండియా వచ్చేశాడు. వైద్యం కోసం బోల్డంత డబ్బు ఖర్చు కావడంతో ఆస్తులు కరిగిపోయాయి. ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.
కొన్ని నెలల క్రితం ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో జాలి’గా కార్యక్రమానికి వచ్చిన సీనియర్ నటి రాగినితో కలిసి వచ్చిన గుండు హనుమంతురావు తన సమస్యల గురించి చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అది చూసి చలించిన అలీ నేను కొంత సహాయం చేస్తానని ముందుకొచ్చారు. తర్వాత మెగాస్థార్ చిరంజీవి రూ. 2లక్షలు, తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయనిధి నుంచి రూ. 5లక్షలు ఆయనకు సహాయంగా అందజేశారు. ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.
‘సత్యాగ్రహం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన గుండు హనుమంతురావు సుమారు నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించారు. అహ నాపెళ్లంట, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, పెళ్లాం ఊరెళితే సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘అమృతం’ టీవీ సీరియల్లో ఆయన చేసిన అంజి పాత్ర ప్రేక్షకులను ఎంతగా నవ్వించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సీరియల్ ఆయనకు నంది అవార్డును తెచ్చిపెట్టింది.