మోదీ రాజకీయం ఇతర నేతలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరిని దువ్వాలో.. ఎవరిని తొక్కాలో ఆయనకు బాగా తెలుసు. బీజేపీని 2 సీట్ల నుంచి 200 సీట్లకు తీసుకెళ్లిన అద్వానీనే మారు మాట్లడకుండా పక్కన కూర్చోబెట్టిన రికార్డు మోదీ సొంతం. అలాగే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో ఆయన చేస్తున్న రాజకీయం నా భూతో న భవిష్యత్ అన్నట్లు ఉంది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవాలను కాంగ్రెస్ చేతుల్లో నుంచి మోదీ ఎలా లాక్కున్నారో తెలిసిందే. తాజాగా జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అలాంటి రాజకీయానికే మోదీ తెర తీశారు. అయితే తమిళ ప్రజలు అంత ఈజీగా జాతీయ పార్టీలను అడుగుపెట్టనివ్వరని తెలిసి ఆయన తెర వెనుక రాజకీయం చేశారు. అందరూ అనుమానిస్తున్నట్లే ఏడాది కాలంగా తమిళ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం, ఆ తర్వాత అది సమసిపోవడం వెనుక మోదీ హస్తం ఉన్నట్లు ఇప్పుడు బట్టబయలైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వమే చెప్పారు. అంతేకాదు అసలు ఆ మంత్రి పదవి కూడా మోదీ భిక్షే అన్న రేంజ్లో ఆయన మాట్లాడారు.
అసలు ఏం జరిగిందంటే.. జయలలిత మరణం తర్వాత సీఎం సీటు కోసం కొట్లాట జరిగిన విషయం తెలిసిందే. శశికళ వేగంగా పావులు కదిపి పన్నీరుసెల్వంను దించి పళనిస్వామిని కుర్చీ ఎక్కించింది. కానీ ఆ వెంటనే పన్నీరు తన దారి తాను చూసుకున్నారు. దీంతో అన్నా డీఎంకే రెండు ముక్కలైంది. పార్టీ గుర్తును కూడా కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఈ రెండు వర్గాలు మళ్లీ ఒకటయ్యాయి. అయితే దీని వెనుక ఉన్నది నరేంద్ర మోదీయే అని పన్నీరు వెల్లడించారు. థేనిలో జరిగిన ఓ బహిరంగ సభలోనే ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. విలీనానికి ముందు మోదీని కలిశాను. పార్టీ బతకాలంటే పళనితో కలవాలని మోదీ సూచించారు. మీరు పార్టీ బాధ్యతలు తీసుకుంటేనే అన్నా డీఎంకే బతుకుతుంది అని ఆయన సలహా ఇచ్చినట్లు పన్నీరు చెప్పారు. అయితే తనకు కేబినెట్లో చేరడం ఇష్టం లేకపోయినా.. మోదీ సూచన మేరకే మంత్రి పదవి స్వీకరించినట్లు ఆయన తెలిపారు. అమ్మ నన్ను రెండుసార్లు సీఎం చేసింది.. అది చాలు అని చెప్పినా.. మోదీ వినకుండా మీరు కచ్చితంగా మంత్రి కావాల్సిందేనని పట్టుబట్టారని పన్నీరు వెల్లడించారు.
ఇప్పుడాయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తమిళ రాజకీయాల్లో మోదీ పాత్ర ఉందనడానికి ఇదే నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. శశికళ తనకు ఎదురు తిరిగింది కాబట్టే.. ఆమెను జైలుకు పంపించి.. పన్నీరుసెల్వాన్ని తెరపైకి తెచ్చారని, ఆయన వెనుక మోదీ ఉన్నారని ఎప్పటి నుంచో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పన్నీరే వాటిని బయటపెట్టడంతో మోదీ మార్క్ రాజకీయంపై మరోసారి చర్చ మొదలైంది. తమిళనాడుపై కన్నేసిన మోదీ.. చిత్రమైన ఎత్తులు వేస్తున్నారు. ఇటు అధికార పార్టీలో నెలకొన్న ముసలాన్ని ఆయనే చల్లార్చారు. అటు ప్రతిపక్ష డీఎంకేనూ దువ్వుతున్నారు. ఆ మధ్య చెన్నై వచ్చినపుడు కరుణానిధి ఇంటికి కూడా వెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులకే 2జీ కేసు నుంచి కనిమొళి బయటపడింది. తమిళనాడు రాజకీయం చాలు.. మోదీ వ్యూహాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి.