కొందరుంటారు.. ఏ అంశంపై అయినా సూటిగా సుత్తి లేకుండా చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. వాళ్లకు ఓ వ్యక్తిపై ఎప్పుడు లవ్వు పుడుతుందో ఎప్పుడు ఒళ్లు మండుతుందో అర్థం కాదు. అలాంటి వ్యక్తుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఆయన స్టైలే అంత. ఎవరమనుకున్నాఆయన మారరు. ఓ వ్యక్తిని పొగడ్తల్లో ముంచెత్తుతారు.. అంతలోనే మళ్లీ తిట్ల దండకం అందుకుంటారు. పవన్ కల్యాణ్‌పై ఎప్పటికప్పుడు వర్మ వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. జనసేన పార్టీ పెట్టినపుడు అభినందించారు. ఆ తర్వాత రజనీకాంత్‌తో పోలుస్తూ.. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము నీకుందా అంటూ పవన్‌ను ప్రశ్నించారు. ఆ మధ్య పవన్ స్పీచ్‌ను చూసి నీలాంటోడే కావాలన్నాడు.. ఆ తర్వాత అజ్ఞాతవాసి మూవీపై సెటైర్లు వేశారు. తాజాగా మళ్లీ ఇప్పుడు ఓ ఫేస్బుక్ పోస్ట్‌తో పీకే పరువు తీసిపారేశాడు.
నిజ నిర్ధారణ కమిటీ పేరుతో పవన్ ఓ జేఏసీ ఏర్పాటు ప్రక్రియ తెర తీసిన విషయం తెలిసిందే కదా. ఈ కమిటీ తొలి రోజు సమావేశం శుక్రవారం జరిగింది. ఆ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడాడు. ఎప్పటిలాగే కాస్త ఆవేశంగా, ఆవేదనతో కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇలా అయితే దేశం ఉత్తర, దక్షిణాలుగా విడిపోతుందిలాంటి తీవ్ర వ్యాఖ్యలూ చేశాడు. దీనిపైనే రాంగోపాల్ వర్మ స్పందించాడు. జనసేన స్థాపించిన సమయంలో పవన్‌ను చూసి ఓ గర్జించే సింహం అనుకున్నా.. కానీ రానురాను అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరచడానికి నువ్వూ ఓ చిరంజీవిలా మారిపోయావా అంటూ దిమ్మదిరిగే సెటైర్ వేశారు. ఈ సెటైర్ చూసి పవన్ కల్యాణ్ అభిమానులు తెగ మండిపోతున్నారు. సహజంగానే తమ హీరోను ఎవరు ఒక్క మాటన్నా ఊరుకోని అభిమానులు.. ఇప్పుడు వర్మపైనా అదే రేంజ్లో విరుచుకుపడుతున్నారు.