వచ్చే వారం డిల్లీలో జరుగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఫ్రాన్కోయీస్ హోలండి ముఖ్య అతిధిగా పాల్గోబోతున్నారు. ఆయన గౌరవార్ధం మొట్ట మొదటిసారిగా ఫ్రెంచ్ ఆర్మీకి చెందిన 136మంది సైనికులతో కూడిన ఒక బృందం కూడా ఈసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా డిల్లీలో జరుగబోయే కవాతులో పాల్గొనబోతోంది. ఫ్రెంచ్ ఆర్మీ బృందంలో 80 మంది సైనికులు, 56మంది బ్యాండ్ బృందం ఉంటారు. వారందరూ కలిసి నిన్న డిల్లీలో రాజ్ పత్ మార్గంలో పరేడ్ రిహార్సల్ నిర్వహించారు. వారు భారత్ ఆర్మీ బృందాలతో బాటు పరేడ్ లో పాల్గొంటారు. భద్రతా కారణాల రీత్యా ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో సుమారు 20నిమిషాలు తగ్గించినట్లు సమాచారం. అందువలన ఈసారి సరిహద్దు భద్రతాదళాలకి చెందిన ఒంటెల ప్రదర్శన ఉండబోదు. దానికి బదులుగా మొట్ట మొదటిసారిగా ఆర్మీకి చెందిన బాంబులను పసిగట్టే కుక్కలు ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి.