కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలి..! ఆంధ్రా నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఇది. వైకాపా ఎంపీలు అవిశ్వాసం ప్రవేశపెడితే కావాల్సిన మద్దతు తాను తీసుకొస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకోపక్క అఖిలపక్షం భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించబోతున్నారు. రాష్ట్రస్థాయిలో ఇంత హడావుడి జరుగుతోంది. అయితే, ఆంధ్రా అంశం జాతీయ స్థాయిలో చర్చనీయమైన మాట వాస్తవమే. ఇతర పార్టీల ఎంపీలు కూడా పార్లమెంటులో ఏపీ ప్రయోజనాలకు మద్దతుగా మాట్లాడారు కూడా! కానీ, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇచ్చేవారు ఎంతమంది..? మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేసేవారు ఎవరు..? పవన్ చెప్పినంత ఈజీగా ఇతర పార్టీల ఎంపీలతో అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయించగలిగే పరిస్థితి ఉంటుందా..? ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి.
ఏపీ అంశాల ప్రాతిపదికన అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందనే కథనాలు వచ్చాయి. అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు ఏపీ నేతలు ఈ ప్రస్థావన తీసుకొస్తే… యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాలతో చర్చించి, ముందుకెళ్దామన్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ, ఒక్క ఆంధ్రా ప్రయోజనాల అంశంతోనే కాంగ్రెస్ అవిశ్వాసానికి వెళ్తే… ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది! ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీలు ఇస్తే తమ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉందనే అభిప్రాయంతో పక్క రాష్ట్రమైన కర్ణాటక ఉంది. అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. త్వరలో అక్కడ ఎన్నికలున్నాయి. కాబట్టి, కేవలం ఏపీ సమస్యతోనే అవిశ్వాసం పెట్టడం అనేది కొంత అనుమానంగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన బ్యాంకు మోసాలు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల వల్ల ప్రజల ఇబ్బందులూ ఇవన్నీ కలగలుపుతూ వాటి మధ్య ఏపీ అంశాన్ని చేర్చి అవిశ్వాసానికి వెళ్లే అవకాశం ఉన్నట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, ఢిల్లీ స్థాయిలో చూసుకుంటే ఆంధ్రా సమస్య అనేది ఉన్నవాటిలో ఒకటి. ఇదొక్కటే జాతీయ సమస్య కాదు.
ఇక, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం అనేది కూడా ప్రశ్నే! ఎందుకంటే, ఏపీకి మద్దతుగా ఓదార్పుగా మాట్లాడటం వేరు… మోడీకి వ్యతిరేకంగా సంతకం చేసి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం వేరు. అంత ధైర్యం ఇతర పార్టీలకు ఉంటుందా అనేదే అనుమానం. తెరాస ఎంపీలు పార్లమెంటులో ఏపీకి మద్దతుగా మాట్లాడారు కాబట్టి, అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేస్తారన్నట్టుగా పవన్ చెప్పారు. కానీ, అదీ అనుమానంగానే కనిపిస్తోంది. ఆంధ్రాకు సంఘీభావం తెలపడం కోసం మోడీతో వైరం కొనితెచ్చుకోవాల్సిన అవసరం వారికి ఏముంటుంది..? అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడమంటే మోడీ సర్కారుతో నేరుగా పోరాటానికి దిగినట్టే కదా! ఇక, తమిళనాడు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు ఇవ్వడం కాస్త అనుమానమే. ఎందుకంటే, అక్కడి రాజకీయాలను మోడీ తెర వెనక ఉండి నడిపిస్తున్న పరిస్థితిని అన్యాపదేశంగా ఈ మధ్యనే పన్నీర్ సెల్వమ్ బయటపెట్టేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మద్దతు అనుమానమే. ఎందుకంటే, ఆంధ్రా రైల్వే జోన్ పై ఆ రాష్ట్రం కొర్రీలే ఎక్కువ. తృణమూల్, బిజు జనతా దళ్ వంటి పార్టీలు అవిశ్వాసం పెడితే ఏపీకి మద్దతుగా మాట్లాడే అవకాశం ఉంది తప్ప, అనుకూలంగా ఓటేసేంత అవసరం వారికేముందుంటి..?
సరే, ఇవన్నీ దాటుకుని పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా ఓ యాభైమంది ఎంపీలు మద్దతు కూడగట్టి అవిశ్వాసం పెడితే ఏం జరుగుతుంది..? కొంత చర్చ జరుగుతుంది, ఒకవేళ ఓటింగ్ అంటూ జరిగితే అవిశ్వాసం వీగిపోవడం అనేది ఖాయం. ఎందుకంటే, సభలో మెజారిటీ పార్టీ భాజపా కాబట్టి. ఆ తరువాత కూడా ఏమౌతుందీ.. మరోసారి అరుణ్ జైట్లీ మాట్లాడతారు. ఆంధ్రా చాలా చేస్తున్నామనీ, ఆలోచిస్తున్నామనీ, పరిశీలనలో ఉన్నాయనీ, తమకున్న ప్రేమంతా అక్కడే కురిపిస్తున్నామని భరోసా ఇస్తారు. అవిశ్వాసం పెట్టినంత మాత్రాన మోడీ సర్కారు వణికిపోయే పరిస్థితి అయితే జాతీయ స్థాయిలో లేదు. దీని వల్ల భాజపా సర్కారుకు వచ్చే నష్టమూ కనిపించడం లేదు. అయితే, దీని వల్ల రాష్ట్ర ప్రయోజనాల విషయమై ఆంధ్రా పార్టీల ఐక్యత ఏపాటిది అనేది తేలిపోతుంది. అందరూ ఐక్యత సాధించాలంటూనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. ఆంధ్రాలో ఏ పార్టీ ప్రయోజనం ఆ పార్టీది. ఇది మోడీకి అర్థం కాని అంశమైతే కాదు.