మెగా అభిమానుల టెన్షన్‌కి తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ బండి కదలబోతోంది. జనవరిలో కొన్ని రోజులు ‘సైరా’ షూటింగ్ జరుపుకుంది. అయితే రషెస్ చూసుకున్న చిరు.. అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ సీన్లన్నీ పక్కన పెట్టారు. ఆ తరవాత… దర్శకుడు మారతాడని జోరుగా ప్రచారం జరిగింది. సినిమా ఆగిపోతోందని కూడా చెప్పుకున్నారు. దాంతో పాటు… షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఈసినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇన్ని అనుమానాల మధ్య ‘సైరా’ మళ్లీ పట్టాలెక్కబోతోంది. ఈనెల 24. 25, 26 న ‘సైరా’ షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగబోతోంది. ఆతరవాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి.. మార్చి తొలి వారంలో షూటింగ్ మొదలెడతారు. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌బచ్చన్ పాల్గొంటారు. ఈ సినిమా నుంచి అమితాబ్ తప్పుకుంటున్నారన్న వార్తలు ఈమధ్య వెల్లువలలా వచ్చాయి. కానీ అమితాబ్ ఈ టీమ్ లోనే ఉన్నారు, ఆయన స్థానంలో ఇంకెవర్నీ తీసుకోలేదని తెలుగు 360 ధృవీకరించింది. ఇప్పుడు అదే నిజమైంది. మార్చి నుంచి… నిరవధికంగా షూటింగ్ జరపాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఇక నుంచి ‘సైరా’ కబుర్లు… బోలెడన్ని వినొచ్చు. ‘సైరా’ అప్డేట్స్ కోసం తెలుగు 360 చూస్తూనే ఉండండి.