టీడీపీతో పొత్తు ఉంచుకోవాలా తెంచుకోవాలా.. కొంతమంది భాజపా నేతలు దీని గురించే ఆలోచిస్తున్నట్టున్నారు! రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ఇచ్చిన హామీల అమలు, బడ్జెట్ లో రాష్ట్రానికి తగ్గిన కేటాయింపులు.. ఇలాంటివేవీ వారి అవసరం లేదన్నట్టుగా ఉంది! ఆంధ్రాలో టీడీపీతో కొనసాగకపోయినా వచ్చిన నష్టమేమీ లేదన్న విశ్లేషణల్లో వారు ముగిని తేలుతున్నారు. పొత్తుకు సంబంధించి ఏపీ భాజపా మంత్రి మాణిక్యాలరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రతీసారీ ఇలానే ఎవరో ఒకరు పొత్తుపై తెగతెంపులు అన్నట్టుగా మాట్లాడటం, ఇది తమ వ్యక్తిగత అభిప్రాయం అన్నట్టుగా చెప్తూ భాజపా అధిష్టానం మనోగతం ఇది కాదేమో అన్నట్టుగా చివర్లో కవర్ చేయడం అనేది ఒక రొటీన్ వ్యవహారం అయిపోయింది.
మంత్రి మాణిక్యాలరావు ఏమన్నారంటే… టీడీపీతో దూరం కావడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదనీ, రాష్ట్రంలో చాలా తక్కువ ఓట్లున్న బలహీనమైన పార్టీ భాజపా అని మాణిక్యాలరావు అన్నారు. కొండకు వెంట్రుక వేస్తున్నామనీ, వస్తే కొండొస్తుందీ పోతే వెంట్రుకే పోతుందన్నారు. దేశంలో చాలా పార్టీలు పొత్తుకు దూరమయ్యాయనీ, శివసేనా అకాలీదళ్ వంటివి పక్కకు వెళ్లాయన్నారు. తమది జాతీయ పార్టీ కాబట్టి కొంతమంది పోయినా నష్టమేమీ లేదనీ, కొన్ని పార్టీలు బయటకి పోతున్నప్పుడు మరికొన్ని వచ్చి చేరుతూ ఉంటాయన్నారు. రాజకీయాల్లో సహజంగా జరిగేది ఇదనీ, దీని గురించి తాము ప్రత్యేకంగా బాధపడేది ఏముంటుందని అన్నారు. ఇక, పదవుల విషయానికొస్తే.. అధిష్టానం ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా చేసేస్తామనీ, చేతిలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి రాజీనామా పత్రాలు పంపడం కూడా చాలా సులువైపోయిందిప్పుడు అని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.
అంటే, తెలుగుదేశం పార్టీతో తెంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టుగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయా అనీ చెప్పలేం! ఎందుకంటే, అనాల్సిదంతా అనేసి, చివర్లో.. ‘టీడీపీతో తెగతెంపులు చేసుకునే ఉద్దేశం ప్రస్తుతానికైతే లేద’ని కూడా ఆయనే చెప్పారు. కొండకు వెంట్రుక కట్టడం అనేది మాణిక్యాలరావు వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలన్నమాట! అయితే, జాతీయ నాయకత్వం అనుమతి లేకుండా ఇలాంటి కీలకమైన వ్యాఖ్యల్ని రాష్ట్ర భాజపా నేతలు చేస్తారా అనే అనుమానం ప్రతీసారీ కలుగుతూనే ఉంటుంది. సంప్రదాయ భాగస్వామ్య పక్షాలను వదలుకునే ఉద్దేశం లేనట్టుగా మోడీ వ్యవహార శైలి ఈ మధ్య కనిపిస్తుంటే… పోతే పోనీ, టీడీపీ కాకపోతే వైకాపా వస్తుందన్నట్టుగా ఏపీ భాజపా నేతలు మాట్లాడుతున్నారు. మొత్తానికి, మాణిక్యాల రావు మాటల్లో పొత్తు తెగినా తెగేదేం లేదన్న ధీమా కనిపిస్తోంది.