హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అమరావతికి తరలిరావడానికి ‘స్థానికత’ కూడా ఒక అవరోధంగా ఉండటంతో, వచ్చే ఏడాది జూన్ నెలలోగా అమరావతికి తరలివచ్చే ఉద్యోగులు, వారి పిల్లలు, ఇతరులకి కూడా స్థానికులుగా పరిగణిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందుకు పార్లమెంటులో ఆర్టికల్ 371 చట్ట సవరణ చేయవలసి ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈవిషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ 2015, నవంబర్ 7న ఒక లేఖ వ్రాసింది. చట్టసవరణ చేసినట్లయితే ఇతర రాష్ట్రాల నుండి కూడా అటువంటి డిమాండ్లు రావచ్చనే కారణంగా కేంద్రం వెనకాడుతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చేయి. కానీ అవి నిజం కాదని తేలింది.
చట్ట సవరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన వినతిని కేంద్ర హోం శాఖ ఆమోదించి న్యాయశాఖ పరిశీలనకు పంపించింది. హోం శాఖ సానుకూలంగా స్పందించింది కనుక న్యాయశాఖ కూడా దీనిపై సానుకూలంగానే స్పందించవచ్చును. దీని వలన న్యాయపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తవని భావించినట్లయితే న్యాయశాఖ కూడా ఆమోదం తెలుపవచ్చును. అప్పుడు హోం శాఖ ఆ ఫైల్ ను ప్రధానమంత్రికి పంపిస్తే ఆయన దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దానిపై ఆమోదముద్ర వేయగానే ఈ ‘స్థానికత’ విధానం అమలులోకి వస్తుంది. ఇది అమలులోకి వస్తే, 2017 జూన్ నెలలోగా తెలంగాణా రాష్ట్రంలో నివసిస్తున్నవారు ఎవరయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివచ్చి స్థిరపదదలచుకొంటే వారు స్థానికులుగా పరిగణింపబడతారు.