పవన్ కల్యాణ్ లాంటి సూపర్ స్టార్‌తో, పవర్ స్టార్‌తో పనిచేసే అవకాశం రావడం నిజంగానే గొప్ప అదృష్టం. అయితే ఆ అదృష్టాన్ని చుట్టుకునే కొన్ని కష్టాలు, నష్టాలూ కూడా ఉంటాయి. అలాంటి ఉమ్మడి ఫీలింగే ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ అనుభవిస్తున్నాడు. కందిరీగ, రభస సినిమాల్ని తెరకెక్కించాడు సంతోష్ శ్రీనివాస్. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ‘అజ్ఞాతవాసి’ కంటే ముందు మొదలవ్వాల్సిన సినిమా ఇది. కానీ త్రివిక్రమ్ కోసం కొంత ఎదురుచూడక తప్పలేదు. ఈ సినిమా అయ్యాక…. ఎలాగూ నా కథే కదా పట్టాలెక్కేది అనుకున్నాడు సంతోష్. కానీ… ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ‘సినిమాలకు గుడ్ బై’ అంటూ పవన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఈ దర్శకుడిలో కంగారు మొదలైంది.
పవన్ కోసం తయారు చేసుకున్న స్క్రిప్టు.. ఇంకొకరికి చెప్పలేడు. ఈ కాంపౌండ్ దాటి వెళ్లలేడు. ఎక్కడో చిన్న ఆశ. ఆ చిన్న ఆశే మళ్లీ చిగురించింది.. ‘సంతోష్ సినిమా ఒక్కటీ చేసేద్దాం’ అని పవన్ డిసైడ్ అయ్యాడు. దాంతో మళ్లీ సంతోష్ పొంగిపోతున్నాడు. అయితే ఈ మధ్యలో స్క్రిప్టుని రెండు మూడు సార్లు మార్చుకోవాల్సివచ్చింది. ‘అజ్ఞాతవాసి’తో పవన్ మరింత జాగ్రత్త పడిపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాల్సిందే. అందుకే సంతోష్‌ని మరో సారి స్క్రిప్టు మార్చి తీసుకురమ్మన్నాడని టాక్. అక్కడక్కడ కొన్ని మార్పులు చెప్పాడని, కొన్ని కొన్ని ఎపిసోడ్లు లేపేసి, ఆ స్థానంలో కొత్తవి రాసుకురమ్మన్నాడని టాక్. తీరా అవి కూడా మార్చుకుని వెళ్లాక పవన్ ఏమంటాడో?? అని భయం పట్టుకుంది సంతోష్‌కి.
ఇప్పటికే పవన్ కోసం యేడాదిన్నర ఎదురు చూశాడు. సినిమా అంతా సెట్టయితే ఓకే… లేదంటే మరి కొంత కాలం ఎదురు చూసే ఓపిక మాత్రం తనకు లేదని సన్నిహితులు అంటున్నారు. పవన్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. తీరా మార్పులు చేశాక… ‘నాకు మూడ్ లేదు’ అన్నా అంటాడు. అందుకే… సంతోష్‌కి దిన దిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుంది పరిస్థితి.