తెలంగాణ ఉద్యమ సమయంలో ఆట పాటలతో కళాకారులు హోరెత్తించిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనుల్ని నాటి పార్టీలు భుజాన వేసుకుంటే, సాంస్కృతికంగా తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కళాకారులే. ఇప్పుడు తెలంగాణ భాజపా అదే మార్గాన్ని ప్రచారవ్యూహంలో భాగంగా అనుసరించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని త్యాగరాయగాన సభలో కళాబృందాలను ఎంపిక చేసే పనిలో టి. భాజపా నేతలు బిజీబిజీగా ఉన్నారు. తొలి విడతగా 50 బృందాలను ఎంపిక చేస్తున్నారు. ఎన్నికలు సమయం వచ్చేసరికి మొత్తంగా వంద బృందాలను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బృందాలను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారానికి పంపనున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలతోపాటు మోడీ సర్కారు సాధించిన విజయాలను ఆట పాట రూపంలో ఈ బృందాలు ప్రచారం చేస్తాయి.
పార్టీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలను ఆట పాట రూపంలోకి ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నామన్నారు. తెరాస వైఫల్యాలను కూడా ఇదే మార్గంలో ఎండగడతామన్నారు. తెలంగాణ సాధనలో కీలక భూమిక వహించి.. పాలకుల కళ్లు తెరిపించింది కళాకారులేననీ, అప్పట్లో తెలంగాణ ధూం ధాం అంటే అర్ధరాత్రి కూడా ప్రజలు ఆదరించేవారన్నారు. అదే స్థాయిలో భాజపా ఎంపిక చేస్తున్న కళాబృందాలు ప్రజల్లోకి వెళ్తాయన్నారు. ఎన్నికల ఏడాదిలో సాంస్కృతికంగా ఏయే కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలన్నది ‘భాజపా జనచైతన్య కళామండలి’ ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగకి కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. మే నెలలో ఎల్టీ స్టేడియంలో పదివేల మంది డప్పు కళాకారులతో ధూం ధాం ఏర్పాటు ఏర్పాటు చేయబోతున్నత్తు కళా మండలి సభ్యులు అంటున్నారు.
నిజానికి, తెలంగాణలో భాజపాను విస్తరింపజేసేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. వాటి ఫలితాలేంటనేది అందరికీ తెలిసిందే..! పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ మధ్య బస్సుయాత్రకు వెళ్లొచ్చారు. ఇప్పుడేమో ధూంధాం అంటున్నారు. అయితే, వారు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే… ఉద్యమ సమయంలో కళాకారులు ఆడిందీ పాడిందీ ప్రత్యేక రాష్ట్రం కోసం. కానీ, ఇప్పుడు భాజపా బృందాలు ఆ పార్టీ గురించి మాత్రమే ఆడిపాడతాయి. ఒక ఉద్యమం కోసం ఇచ్చే ప్రదర్శనకీ, ఒక పార్టీ ప్రచారం కోసం పాడే పాటకీ ఆటకీ వచ్చే స్పందనలో చాలా తేడా ఉంటుంది కదా! మరి, భాజపా ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.