వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఏం మాట్లాడినా… దానికి పక్కా ఆధారాలు ఉంటాయనీ, పక్కా లాజిక్ ఆయన దగ్గర ఉంటుందని వైకాపా శ్రేణులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి. అందుకే, జాతీయ స్థాయిలో వైకాపా తరఫున ఏదైనా మాట్లాడాలన్నా, విమర్శించాలన్నా ఆయనే మీడియా ముందుకు వస్తుంటారు. ఏపీ కేటాయింపుల విషయమై యూనియన్ బడ్జెట్ పై కేంద్రమంత్రి సుజనా చౌదరి విమర్శలు చేస్తుంటే.. క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటే రాజీనామా చేయాలనే పాయింట్ మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక, తాజా విషయానికొస్తే… ఎంపీ విజయసాయిరెడ్డిపై ఐ.ఎ.ఎస్. అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కొద్దిరోజుల కిందట ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటికి స్పందనగా ఐ.ఎ.ఎస్. అధికారుల సంఘం స్పందిస్తూ ఘాటుగా ఒక నోట్ విడుదల చేసింది.
ఓ రెండు వారాల కిందట రాష్ట్రపతిని విజయసాయిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర కీలకంగా ఉన్నారంటూ ఆరోపించారు. అంతేకాదు, నిఘా విభాగాధిపతిగా పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఈ కొనుగోళ్లకు తోడ్పాడు అందించారన్నారు. ఈ ఇద్దరు అధికారులూ ఎమ్మెల్యేల బేరసారాల్లో కీలకపాత్ర పోషించారని ఫిర్యాదు చేసినట్టు విజయసాయి రెడ్డి చెప్పారు. అప్పట్నుంచీ ఐ.ఎ.ఎస్. అధికారుల సంఘం విజయ సాయి మీద గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక నోట్ విడుదల చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్న ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని అధికారుల సంఘం అభిప్రాయపడింది. రాజకీయ విమర్శల్లోకి అధికారులను లాగొద్దని మండిపడింది. అంతేకాదు, ఎలాంటి ఆధారాలూ చూపకుండా తమపై వైకాపా ఎంపీ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు నోట్ లో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను సహించేది లేదని మండిపడ్డారు.
ఏదో ఒక బలమైన పాయింట్ దొరకబుచ్చుకుంటే తప్ప విజయసాయి రెడ్డి మాట్లాడరని వైకాపా వర్గాలు అంటాయి. మరి, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఉన్నతాధికారుల పాత్రపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఆధారాలు లేకుండానే వెళ్లారా..? ఆధారాలు లేకపోతే ఉన్నతాధికారులు ఈ స్థాయిలో ఆగ్రహిస్తారని ముందుగా ఊహించలేకపోయారా..?