వెంకటేష్ – నాగచైతన్యల్ని ‘ప్రేమమ్’లో చూశాం. మేనల్లుడి కోసం చిన్న పాత్ర చేశాడు వెంకీ. అది బాగా పేలింది. అప్పటి నుంచీ వెంకీ, చైతూల్ని పూర్తి స్థాయి సినిమాలో చూడాలని ఇటు దగ్గబాటు, అటు అక్కినేని అభిమానులు ఆశ పడుతున్నారు. వాళ్ల కలలు ఫలించి.. వీరిద్దరితో ఓ మల్టీస్టారర్ సెట్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని టేకప్ చేసింది. ‘సోగ్గాడే చిన్నినాయిన’ దర్శకుడు కల్యాణ్ కృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఇప్పుడు ఈ టీమ్‌లో కీలకమైన మార్పు జరిగిందని సమాచారం.
ఈ టీమ్‌లోంచి కల్యాణ్ కృష్ణ తప్పుకున్నట్టు తెలుస్తోంది. తనకున్న కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నాడట. ఆ అవకాశం బాబికి దక్కినట్టు సమాచారం. ‘జై లవకుశ’తో ఓ హిట్టు అందుకుని ఫామ్‌లోకి వచ్చాడు బాబి. ఇప్పుడు ఈ మల్టీస్టారర్‌ని తన భుజాలపై వేసుకున్నట్టు సమాచారం. వెంకీ ప్రస్తుతం తేజతో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాకే ఈ మల్టీస్టారర్ సెట్స్‌పైకి వెళ్లనున్నదని సమాచారం.