హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న రోహిత్ ఆత్మహత్య కేసులో ఇవాళ మరో మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నరోజుకు ముందు రాత్రి రోహిత్‌కు, ఏబీవీపి విద్యార్థులకు మధ్య జరిగిన వాగ్వాదం తాలూకు వీడియో మీడియాలో ప్రత్యక్షమయింది. ఆ వీడియోలో, రోహిత్ ఒక పోస్టర్‌ను చించటంపై ఏబీవీపీ విద్యార్థులు నిలదీయటం కనిపిస్తోంది. పోస్టర్‌ను ఎందుకు చించావని అడగగా, తనకు కాషాయం రంగు కనిపిస్తే నచ్చదని, అందుకే చించానని రోహిత్ చెబుతున్నాడు. దానిపై ఏబీవీపీ విద్యార్థులు రోహిత్మీద మండిపడటం కనిపిస్తోంది.
మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ సహ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వీసీ ఛాంబర్ ముందు విద్యార్థులు బైఠాయించి వీసీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు పెద్దఎత్తున వర్సిటీలో మోహరించారు. ఇదిలా ఉంటే, రాంనగర్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ నివాసాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జాగృతి కార్యకర్తలను నిలువరిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి దళిత విద్యార్థులకు సంఘీభావం తెలపటానికి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి రాబోతున్నారు.