తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5
ఇది వరకు దెయ్యాలంటే భయపడేవారు
ఇప్పుడు దెయ్యం సినిమా అంటే భయం వేస్తోంది.
అదే పాడుపడ్డ కొంప
అదే కామెడీ గ్యాంగ్
అవే వెకిలి నవ్వులు.. వెరసి అదే తలనొప్పి
హారర్ కామెడీ సినిమాల్ని ఈడ్చిపెట్టి తన్నుతున్నా… ఇంకోటి వచ్చి మీద పడుతోంది.
అప్పుడెప్పుడో తెలుగు రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించినట్టు
కొన్నాళ్ల పాటు తెలుగు సినిమాలో హారర్ కామెడీని నిషేధిస్తే బాగుణ్ణు,…
అనిపించిన సినిమా ఏదైనా ఉందీ అంటే… అది ‘రా..రా’నే.
* కథ :
శ్రీకాంత్ ఓ దర్శకుడు. అప్పటికే మూడు అట్టర్‌ఫ్లాప్ సినిమాల్ని తీస్తాడు. తండ్రి సంపాదించిన ఆస్తులన్నీ తగలేస్తాడు. మూడో సినిమా చూసి కన్నతల్లికి గుండెపోటు వస్తుంది. నేనో హిట్టు సినిమా తీశా… అనే ఓ స్వీట్ న్యూస్ చెప్పి తల్లిని ఆరోగ్యవంతురాల్ని చేద్దామనుకుంటాడు. అందులో భాగంగా ఓహారర్ సినిమా తీద్దామని, లొకేషన్ కోసం పాడుపడ్డ బంగ్లాకి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ ఓ దెయ్యం ఫ్యామిలీ కాపురం చేస్తుంటుంది. వాళ్లకేమో మనుషులంటే భయం. మరి ఈ సినిమా గ్యాంగ్‌కీ, ఆ దెయ్యం గ్యాంగ్‌కీ ఏం జరిగింది?? శ్రీకాంత్ హిట్టు సినిమా తీయగలిగాడా, లేదా? అనేదే కథ.
* విశ్లేషణ :
ఓ దెయ్యాల కొంప.. అందులో సినిమా తీయడానికి వెళ్లిన ఓ సినిమా గ్యాంగ్ – అరిగిపోయిన కాన్సెప్టే. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడడం అనేది ‘ఆనందో బ్రహ్మ’లో చూశాం. అందులో ఆ పాయింట్ తలకెక్కిందంటే కారణం… ఆర్టిస్టులు బాగా కుదిరారు, కామెడీ పండింది. ఈ సినిమాలో అవి రెండూ ఫెయిల్ అయ్యాయి.
ఓపెనింగ్ షాట్లో గిరిబాబు కనిపించినప్పుడు… ఆ పక్క నుంచి వంద సినిమాల హీరో శ్రీకాంత్ అర్థం పర్థం లేని వెటకారపు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నప్పుడే ప్రేక్షకులకు కొన్ని సూచనలు అందేస్తాయి. ‘ఇప్పుడో భయంకరమైన సినిమా చూడబోతున్నామ’ని. దాన్ని సీను సీనుకూ నిజం చేసి పారేస్తూ వెళ్లింది చిత్రబృందం. దెయ్యాలు – మనుషుల మధ్య గేమ్ షో అయితే… ఆ బాధ వర్ణనాతీతం. ప్రేక్షకులతో ఫుట్ బాల్ ఆడేసుకున్నారంతా. తొలి సగంలో ముఫ్ఫై సన్నివేశాలు జరిగినా.. దానికీ కథకీ ఎలాంటి సంబంధం ఉండదు. సరిగ్గా ఇంట్రవెల్ ముందు సెకండాఫ్‌లో మరో దెయ్యం గ్యాంగ్ కథలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ్నుంచి సీరియస్ ఎమోషన్స్ నడుస్తాయనుకుంటే… ఆ ఆశల్నీ మొదలు నుంచి నరికేశారు. ఆ దెయ్యంతో హీరోగారి రొమాన్స్, వాళ్ల మధ్య పాటలు, ప్రేమ.. ఇలా `హింస` టు బీ కంటిన్యూ అయ్యింది. దెయ్యాలతో సినిమా తీసి చివరికి హీరోగారు హిట్టు కొట్టేస్తారు. కాకపోతే.. ఈమధ్య ప్రేక్షకుల్ని రాచి రంపాలు పెట్టారంతా. ఈ సినిమాలో కామెడీ ఉంది.. కానీ నవ్వు రాదు దెయ్యం ఉంది.. కానీ భయం పుట్టదు – మరెందుకు తీస్తారో ఇలాంటి సినిమాల్ని! దెయ్యాల చేతుల్లో కమెడియన్స్ చిక్కినప్పుడు.. సదరు దయ్యం ఆ కమెడియన్ని ఫుట్‌బాల్ ఆడేసుకుంటుంటుంది. థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి కూడా అంతే. ‘మమ్మల్ని వదిలేయమ్మా తల్లీ’ అంటూ కాళ్ల మీద పడాలనుకుంటాం. కానీ.. దెయ్యాలకు కాళ్లు ఉండవు కదా.. ఆ ఛాన్స్ కూడా లేకుండా పోతుంది.
అన్నట్టు దెయ్యాలకు కాళ్లుండవన్నది ఈ సినిమా లాజిక్. అయితే కొన్ని సార్లు ఆ దెయ్యాలకు కాళ్లుంటాయి.. కొన్నిసార్లు కనిపించవు.. ఇదేం దర్శకత్వ ప్రతిభో అర్థం కాదు. కనీసం లాజిక్ లెస్ సీన్లు తీస్తున్నప్పుడైనా లాజిక్ ఆలోచించాలి కదా?? సినిమాలో ఓచోట విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’లోని కొన్ని సీన్లు చూపించి ‘గ్రాఫిక్స్‌లేని రోజుల్లో ఎంత బాగా తీశారండీ’ అనే డైలాగ్ చెప్పించారు. మరి ఇన్ని గ్రాఫిక్స్ హంగులున్న ఈ రోజుల్లో దెయ్యం సినిమాల్ని ఇంకెంత బాగా తీయాలి..? కానీ ఇందులో గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. విఠలాచార్య సినిమాల్ని చూసి స్ఫూర్తి పొందిన సదరు.. ఈ టీమ్ – ఆయన్ని 1% కూడా ఫాలో కాకపోవడం ఆశ్చర్యం… మనం చేసిన పాపం!!
”తుర్రుమని పారిపో..
ఛాన్స్ ఉంటే పారిపోరా”
అంటూ బ్యాక్ గ్రౌండ్లో ఓ పాట వినిపిస్తుంటుంది.. – అది ప్రేక్షకులకు చిత్రబృందం ఇచ్చే హింట్ అని తెలిసొచ్చి తెలివొచ్చి… లేచొచ్చిన ప్రేక్షకుడు తెలివైనోడు.
* నటీనటులు :
నూట పాతిక సినిమాలు చేసిన శ్రీకాంత్… తన అనుభవాన్నంతా ఎక్కడ దాచిపెట్టాడో? ‘ఈ మాత్రం సినిమాకీ, ఈ మాత్రం పాత్రకీ ఇంతకంటే ఏం చేయాలి’ అనుకుని తాను కూడా కామ్ అయిపోయి ఉంటాడు. అదేదో కథ ఒప్పుకునే ముందు.. ‘కామ్’ అయితే బాగుండేది. ఆయన నటించిన సినిమాలన్నింటిలోనూ.. మర్చిపోదగిన సినిమా ‘రా..రా’. ఇంత అనుభవం ఉన్న శ్రీకాంతే డల్ అయిపోతే… మిగిలిన వాళ్ల సంగతి వేరే చెప్పాలా?? కమెడియన్ల నుంచి కామెడీ రాబట్టుకోలేనప్పుడు వాళ్లెంత అద్భుతంగా చేశారో చెప్పడానికి ఏం ఉంటుంది? హీరోయిన్ మరీ బొద్దుగా కనిపించింది. ఫృద్వీ కాసేపు ఓకే అనిపిస్తాడు. అలీ లాంటి వాళ్లు కూడా తేలిపోతే.. జబర్ దస్థ్ గ్యాంగ్ మాత్రం అద్భుతాలు సృష్టిస్తుందా.. ఏంటి?
* సాంకేతికంగా :
‘ఈ సినిమాకి దర్శకుడిగా నా పేరు వేయొద్దు’ అని ఘోస్ట్ రైటర్ మొర పెట్టుకున్నాడంటే… ఈ సినిమాపై ఆయనకు ఎంత నమ్మకమో చూడండి. ఇక ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి ఏం చెప్పుకుంటాం?? కథ, కథనాలు పేలవంగా ఉన్నాయి. కామెడీ నిరసంగా ఉంది. సంగీతం చాదస్తంగా అనిపిస్తుంది. గ్రాఫిక్సు.. జిరాక్సు కాపీల్లా వెలవెలబోతాయి. శ్రీకాంత్ నటించిన సినిమాల్లో క్వాలిటీ పరంగా నాశిరకంగా ఉన్న సినిమాల్లో దీనికి అగ్రతాంబూలం ఇవ్వొచ్చు
* తీర్పు :
హారర్ కామెడీ సినిమాలకు చిత్రసీమ దూరంగా ఉండాలన్న వార్నింగ్ బెల్.. ఇంకాస్త గట్టిగా వినిపించిన సినిమా.. ‘రా..రా’. పేలవమైన కథ, కథనాలకు.. జీవం లేని నటన తోడైతే ఫలితం ఇంతే దారుణంగా ఉంటుంది
* ఫినిషింగ్ టచ్: వెళ్తే.. వాతే!
తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5