బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ హడావుడిలో ఉన్నాడు. నాన్నగారి సినిమా, పైగా తనే ఆ పాత్ర పోషించాలి, మరోవైపు నుంచి ఎన్టీఆర్‌కి సంబంధించిన సమస్త విషయాలూ సేకరించాలి, స్క్రిప్టు పనుల్లో బాలయ్యదే.. సింహభాగం. వచ్చే నెలలో షూటింగ్ మొదలవ్వాలి. ఈ దశలో బాలయ్యపై మరో వార్త చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. ఎన్టీఆర్ బయోపిక్‌కి ముందే.. బాలయ్య మరో సినిమా మొదలెడతారని, దీనికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని, ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్‌కి ముందు.. మరో సినిమా మొదలెట్టే అవకాశం ఉందా, లేదా? అనే విషయంపై తెలుగు 360 ఆరా తీసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సి.కల్యాణ్ తో బాలయ్య సినిమా ఇప్పుడే ఉండకపోవొచ్చు. అటు సి.కల్యాణ్ గానీ, ఇటు బాలయ్య గానీ ఈ సినిమా గురించి ఏమాత్రం తొందరపడడం లేదని టాక్. సి.కల్యాణ్ ఇంట్లో ఓ శుభకార్యం ఉంది. ప్రస్తుతం ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. బాలయ్య సంగతి సరే సరి. ఎన్టీఆర్ బయోపిక్ హడావుడి అంతా ఆయనదే. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ఇంకా జరుగుతూనే ఉంది. ఈ దశలో మరో సినిమాపై ఫోకస్ చేయడం చాలా కష్టం. ప్రస్తుతం బాలయ్య దృష్టి ఎన్టీఆర్ బయోపిక్‌పైనే ఉందని, మరో సినిమా గురించి ఆలోచించడం లేదని, సి.కల్యాణ్‌తో సినిమా ఉన్నా, అది ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని ఆయన సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సో.. బాలయ్య పై వస్తున్న ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదన్నమాట.